- కలెక్టర్ ఇలా త్రిపాఠి
హాలియా, వెలుగు: ఎన్నికల నిర్వహణను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. రెండో విడత నామినేషన్లలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా, పెద్దవూర గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రంలో సౌకర్యాలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నామినేషన్ పత్రాల సమర్పణ సమయంలో ఎవరైనా అభ్యర్థి నామినేషన్ తో పాటు, కుల ధ్రువీకరణ పత్రం బదులుగా గెజిటెడ్ డిక్లరేషన్ సమర్పించినా అంగీకరించాలని చెప్పారు.
సాయంత్రం 5 గంటలలోపు నామినేషన్ కేంద్రంలోకి వచ్చిన వారిని మాత్రమే నామినేషన్ వేసేందుకు అనుమతించాలన్నారు. నామినేషన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్, నామినేషన్ సందర్భంగా స్వీకరించే పత్రాల వివరాలు తెలిపే ఫ్లెక్సీ, తదితర వివరాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఆమె వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఎంపీడీఓ ఉమాదేవి, తహసీల్దార్ శ్రీదేవి, ఎం ఈ ఓ రాము, ఆర్ ఐ లు శ్రీనివాస రెడ్డి, రామకృష్ణ, తదితరులు ఉన్నారు.
