
ములుగు, వెలుగు: భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ములుగు జిల్లాలో ప్రకృతి విపత్తుల ద్వారా ప్రాణనష్టం కలుగకుండా, ప్రత్యేక విపత్తు రక్షణ బృందాలతో సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ దివాకర తెలిపారు. గోదావరి, జంపన్న వాగు పరిసర ప్రాంతాల ప్రజలకు ముందు జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎన్డీఆర్ఎఫ్ బృందం జిల్లాకు చేరుకున్న నేపథ్యంలో కలెక్టర్ తన ఛాంబర్లో అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీతో కలిసి సమీక్ష నిర్వహించారు.
జిల్లాలోని రామప్ప, లక్నవరం సరస్సులు, గోదావరి నది, జంపన్నవాగు పరిసరాల్లో నీటి ప్రవాహం, గతంలో జరిగిన సంఘటనల గురించి ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులకు వివరించారు. విజయవాడ10వ బెటాలియన్ కమాండెంట్ ప్రసన్న కుమార్ ఆదేశాల ప్రకారం ఆర్ఆర్ సీ హైదరాబాద్ నుంచి ఇన్స్పెక్టర్ ముకేశ్‌కుమార్, ఏఎస్ఐ సుధీర్, హెడ్ కానిస్టేబుల్ జగదీశ్‌తో 28సభ్యుల బృందం వర్షాకాలం ముగిసే వరకు జిల్లాలో ఉంటుందన్నారు. బృందం సభ్యులకు ఏర్పాట్ల సమకూర్చాల్సిందిగా జిల్లా పంచాయతీ అధికారికి సూచించారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్–11లో భాగంగా జిల్లాస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. బాలకార్మికులు లేని జిల్లాగా తీర్చి దిద్దేందుకు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.