
న్యూఢిల్లీ: దేశానికి వ్యతిరేకంగా పనిచేసే, ప్రవర్తించే జర్నలిస్టుల అక్రెడిటేషన్లను రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ‘సెంట్రల్ మీడియా అక్రెడిటేషన్ గైడ్‌లైన్స్ 2022’ పేరిట కేంద్ర సమాచార, ప్రసార శాఖ కొత్త గైడ్‌లైన్స్‌ను జారీ చేసింది. దేశ భద్రత, భౌగోళిక పరిస్థితులు, సమగ్రతను దెబ్బతీసేలా ప్రవర్తించినా.. నైతిక విలువలు, ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోయినా, కోర్టు ధిక్కరణ, పరువు నష్టానికి పాల్పడినా జర్నలిస్టుల అక్రెడిటేషన్‌ను రద్దు చేస్తామని అందులో పేర్కొంది. తప్పుడు వార్తలు ప్రసారం చేసినా రెండేండ్ల నుంచి ఐదేండ్ల దాకా అక్రెడిటేషన్‌ను రద్దు చేయనుంది. కొత్త గైడ్‌లైన్స్‌లో భాగంగా ఆన్లైన్ న్యూస్ ప్లాట్‌ఫాం (డిజిటల్ మీడియా)లలో పనిచేసే జర్నలిస్టులకూ ఇకనుంచి అక్రెడిటేషన్ ఇవ్వనుంది. అయితే, న్యూస్ అగ్రిగేటర్ల (వివిధ సంస్థలు పబ్లిష్ చేసే వార్తలను జనానికి చేరేవేసే ప్లాట్‌ఫాంలు)కు మాత్రం అక్రెడిటేషన్లు ఉండబోవని స్పష్టం చేసింది. ఇకపై అక్రెడిటేషన్ ఉన్న జర్నలిస్టులెవరూ ‘కేంద్ర ప్రభుత్వ అక్రెడిటేషన్’ అని ఎక్కడా చెప్పుకోవద్దని స్పష్టం చేసింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ప్రిన్సిపల్ డైరెక్టర్ చైర్‌పర్సన్‌గా 25 మంది సభ్యులతో సెంట్రల్ మీడియా అక్రెడిటేషన్ కమిటీ (సీఎంఏసీ)ని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించింది. కమిటీ ఏర్పాటైన నాటి నుంచి రెండేండ్ల పాటు కమిటీ ఉంటుందని తెలిపింది. జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు ఇవ్వడం, రద్దు చేయడం వంటి అధికారాలన్నీ కమిటీకే ఉంటాయని తేల్చి చెప్పింది. అక్రెడిటేషన్ కేసులను తేల్చేందుకు సీఎంఏసీ కింద ఐదుగురు నామినేటెడ్ సభ్యులతో సబ్ కమిటీనీ ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. దానికీ చైర్‌పర్సన్‌గా పీఐబీ డీజీనే ఉంటారని స్పష్టం చేసింది.