జాతీయ బాక్సింగ్ చాంపీయన్ షిప్ కైవసం చేసుకున్న తెలంగాణ అమ్మాయి

జాతీయ బాక్సింగ్ చాంపీయన్ షిప్ కైవసం చేసుకున్న తెలంగాణ అమ్మాయి


జాతీయ మహిళల బాక్సింగ్ చాంపియన్ షిప్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ గెలిచింది.  మధ్య ప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ వేదికగా జరిగిన జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 50కేజీల విభాగంలో నిఖత్‌ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్‌ మ్యాచ్‌లో   రైల్వేస్కు చెందిన అనామికపై 4-1 స్కోరు తేడాతో జరీన్‌ విజయం సాధించింది. ప్రతిష్ఠాత్మక టోర్నీలో పసిడి పతకాన్ని దక్కించుకున్న నిఖత్..ఈ ఏడాదిని ఘనంగా ముగించింది.

జాతీయ మహిళల బాక్సింగ్ చాంపియన్ షిప్ లో నిఖత్ జరీన్ అంచనాలకు మించి రాణించింది. 50 కేజీల విభాగంలో బరిలోకి దిగిన ఆమె సెమీస్ లో  ఏఐపీకు చెందిన శివిందర్ కౌర్ పై 5-0 తేడాతో  విజయం సాధించింది. దీంతో పసిడి పోరుకు చేరుకుంది. ఇక ఫైనల్లో ఇదే జోరును కొనసాగించిన నిఖత్ జరీన్ మరోసారి తన పంచ్ పవర్ చూపెట్టి...బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ ఏడాది ఆడిన అన్ని టోర్నమెంట్లలోనూ గెలిచిన నిఖత్ అజేయంగా నిలిచినట్టయింది. ఈ ఏడాది మొదట్లో స్ట్రాంజా మెమోరియల్ టోర్నీలో నిఖత్ స్వర్ణాన్ని సాధించింది. ఆ  తర్వాత ప్రపంచ చాంపియన్ షిప్ గెలిచి చరిత్ర సృష్టించింది.అనంతరం కామన్వెల్త్ క్రీడల్లోనూ గోల్డ్ మెడల్ గెలిచింది. తాజాగా జాతీయ చాంపియన్ షిప్ లోనూ స్వర్ణాన్ని సొంతం చేసుకుంది.