
సెంచరీకి ఒక్క పరుగు దూరంలో వికెట్ కోల్పోతే ఆ బ్యాట్స్‌మెన్ హార్ట్ బ్రేక్ అవడం ఖాయం. ప్రత్యర్థి జట్టుకు, సదరు బౌలర్‌కు అది అదిరిపోయే మూమెంట్. కానీ.. అదే ప్రత్యర్థి జట్టు కూడా ఆ బ్యాట్స్‌మెన్‌కు సానుభూతి తెలుపుతుంది. అప్పటి దాకా చూపిన పోరాట పటిమను ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు కూడా ప్రశంసించకుండా ఉండలేరు. టీమిండియాతో ఇంగ్లండ్ ఆడుతున్న తొలి టెస్ట్‌లో ఇదే జరిగింది. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ శతకానికి ఒకే ఒక్క పరుగు దూరంలో ఔట్ అయ్యాడు.
ఇంగ్లండ్ అభిమానులకు ఇదో హఠాత్ పరిణామం. సెంచరీ చేయడం ఖాయమని అంతా భావించారు.112 బంతుల్లో 99 పరుగులు చేసిన బ్రూక్.. ప్రసీద్ కృష్ణ బౌలింగ్‌లో బ్రూక్ భారీ షాట్‌కు యత్నించాడు. కానీ.. డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్‌లో శార్దూల్ ఠాకూర్‌కు క్యాచ్‌గా చిక్కడంతో బ్రూక్ సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. ప్రసీద్ కృష్ణ బౌలింగ్ చేసిన 87.3 ఓవర్లో ఇది జరిగింది.
హెడింగ్లీలో 99 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద టెస్టుల్లో ముగ్గురు బ్యాట్స్ మెన్స్ వికెట్ కోల్పోయారు. 1987లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ క్రికెటర్ సలీమ్ మాలిక్ 99 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వికెట్ కోల్పోయాడు. 1994లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా మ్యాచ్‌లో మైఖేల్ ఆండ్రూ అథర్టన్ 99 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర వికెట్ కోల్పోవడంతో సెంచరీ మిస్ అయింది. మళ్లీ.. ఇన్నేళ్ల తర్వాత ఇదే స్టేడియంలో హ్యారీ బ్రూక్‌కు 2025లో ఈ చేదు అనుభవం ఎదురైంది.
అయితే.. ఈ మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ చేసిన 99 పరుగులు ఇంగ్లండ్ జట్టుకు చాలా సాయపడ్డాయని చెప్పక తప్పదు. క్రిస్ ఓక్స్ కూడా 91వ ఓవర్లో ప్రసీద్ కృష్ణ బౌలింగ్‌లో 91.4, 91.5 బంతుల్లో బ్యాక్ టూ బ్యాక్స్ సిక్సులు బాదేశాడు. దీంతో.. ఇంగ్లండ్ జట్టు 92 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 441 పరుగులు చేసింది.