జల సంరక్షణ పనుల్లో నిర్మల్ టాప్

జల సంరక్షణ పనుల్లో నిర్మల్ టాప్
  • ఏడాదిలో 60,350 నీటి సంరక్షణ పనులు
  • జిల్లాకు కోటి నజరానా సౌత్ జోన్ లో సెకండ్ ర్యాంక్

నిర్మల్, వెలుగు: వర్షం నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాల పెంపు, సాగునీటి అవసరాలను తీర్చేందుకు నిర్మల్ జిల్లా అధికారులు చేపట్టిన ప్రత్యేక ప్రణాళికకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. జల్ ​సంచయ్ జన్​ భాగిదారి (జేఎస్ జేపీ) పథకంలో భాగంగా వర్షం నీటిని నిల్వ చేసే పలు పథకాలు చేపట్టిన నిర్మల్ జిల్లా దక్షిణ భారతదేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. 

కేంద్ర జల సంరక్షణ ఆధ్వర్యంలో  జేఎస్ జేపీ పథకం కింద ఏటా నీటి వనరులను పెం పొందించేందుకు కృషి చేస్తున్న జిల్లాలను గుర్తించి జాతీయస్థాయి ర్యాంకులను కేటాయిస్తున్నారు. జిల్లాలను ప్రోత్సహించేందుకు నగదు బహుమతి కూడా అందిస్తున్నారు. కాగా ఈసారి నిర్మల్ జిల్లా సౌత్ ఇండియా స్థాయిలో రెండో ర్యాంక్ తో పాటు రూ.కోటి నజరానా దక్కింది. ఈనెల 18న కలెక్టర్ అభిలాష అభినవ్, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి తదితరులు ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో పాల్గొని రివార్డును అందుకోనున్నారు.  

చెక్ డ్యాములు, కుంటల నిర్మాణం

జిల్లాలో పెద్ద ఎత్తున చెక్ డ్యాములు, కుంటలు, నీటి గుంతలు, వాటర్ హార్వెస్టర్ల ఏర్పాటు పనులను చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 60,350 పనులు చేసి రికార్డు సృష్టించారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం కింద నిర్దేశిత గడువులోగా ఈ పనులను పూర్తిచేశారు.

 అధికారుల పర్యవేక్షణ, తనిఖీల కారణంగా గడువులోగానే పనులు పూర్తయ్యాయి. అధికారుల కృషిని గుర్తించి కేంద్ర జల సంరక్షణ శాఖ నిర్మల్ జిల్లాను ఈ రివార్డుకు ఎంపిక చేసింది.