ఆన్​లైన్​ క్లాసులతో చదువులు ఆగమాగం

ఆన్​లైన్​ క్లాసులతో చదువులు ఆగమాగం
  • నేషనల్​ ఇండిపెండెంట్ స్కూల్​అలయెన్స్​ సర్వేలో వెల్లడి
  • లెర్నింగ్​ లాస్​పై దేశవ్యాప్తంగా ‘నిసా’ అధ్యయనం
  • తెలంగాణలోనూ పిల్లల అభిప్రాయాల సేకరణ

హైదరాబాద్, వెలుగు: కరోనా టైమ్ లో ​నడిచిన ఆన్ లైన్​క్లాసుల వల్ల పిల్లలకు పెద్ద ఉపయోగం లేకుండా పోయిందని, మాతృభాషతోపాటు మ్యాథ్స్, ఇంగ్లిష్​లలో వెనకబడ్డారని నేషనల్​ ఇండిపెండెంట్ స్కూల్​అలయెన్స్(నిసా) సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా బడ్జెట్ స్కూళ్లు మెంబర్లుగా ఉన్న ఈ సంస్థ కరోనా టైమ్​లో ‘లెర్నింగ్ ​లాస్, లెర్నింగ్​ పావర్టీ’ అనే అంశంపై సర్వే చేపట్టింది.17 రాష్ట్రాల్లో చేసిన సర్వేలో తెలంగాణ కూడా ఉంది. ఆన్​లైన్​ క్లాసుల వల్ల సబ్జెక్ట్ పూర్తిగా అర్థం గాక స్టూడెంట్స్ ప్రస్తుతం వారు చదువుతున్న క్లాస్​ కన్నా ఒకటి, రెండు తరగతులు వెనకబడినట్లు ఇటీవల విడుదల చేసిన సర్వే రిపోర్ట్​పేర్కొంది. 
లెక్కల్లో వెనకంజ
రూరల్, అర్బన్, సెమీ అర్బన్​ ప్రాంతాల్లో గల స్కూళ్లలో మూడు, ఐదు, ఎనిమిదో తరగతి విద్యార్థుల స్కిల్స్​ను ‘నిసా’ పరిశీలించింది. మూడో తరగతి చదువుతున్న 44 శాతం స్టూడెంట్స్ మ్యాథ్స్​లో వెనకబడి ఉన్నారు. అదే క్లాసుకు చెందిన 36 శాతం మంది తాము చదువుతున్న తరగతి కన్నా ఒక క్లాస్​తక్కువ సామర్థ్యం కలిగి ఉన్నారు. 8 శాతం విద్యార్థులు రెండు క్లాస్​ లెవల్స్​ వెనకబడి ఉన్నారు. సెమీ అర్బన్​లో ఉండే ఐదో తరగతి విద్యార్థుల్లో 42 శాతం పిల్లలు మ్యాథ్స్​లో వెనకబడిపోగా, ఎనిమిదో తరగతిలో 34  శాతం మంది విద్యార్థులు వెనకంజలో ఉన్నారు. ‘ప్రతి ముగ్గురు విద్యార్థుల్లో ఒకరు లెక్కల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సర్వేలో తేలింది. 
మాతృభాషలోనూ ఇబ్బందులే..
మాతృభాషలో కూడా స్టూడెంట్స్​ వెనకబడి ఉన్నారు. తెలంగాణ, ఏపీ లాంటి రాష్ట్రాల్లో పిల్లలు తమ మాతృభాష తెలుగు చదవడం, రాయడంలో ఇబ్బంది పడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో 30 శాతం మంది, గ్రామీణ ప్రాంతాల్లో 24 శాతం మంది పిల్లలు మాతృభాషను చదవడంలో ఇబ్బందులు పడుతున్నారు. 35 శాతం అర్బన్​ స్టూడెంట్లు మాతృభాషలో రాయలేకపోతున్నారు. రూరల్​లో 30 శాతం మంది స్టూడెంట్స్​దీ అదే పరిస్థితి. ఇంగ్లిష్​లో థర్డ్ క్లాసులో 35 శాతం, ఐదో క్లాసులో 26 శాతం, ఎనిమిదో క్లాసులో 19 శాతం మంది విద్యార్థులు రీడింగ్​ స్కిల్​లో వెనకబడి ఉన్నారు. సెమీ అర్బన్​ విద్యార్థుల కన్నా అర్బన్​ స్టూడెంట్సే ఇంగ్లిషులో ఎక్కువ వెనకబడి ఉన్నారని నిసా స్టడీలో తేలింది. అర్బన్​ ప్రాంతాల్లో 30 శాతం, సెమీ అర్బన్​లో 22 శాతం మంది విద్యార్థులు ఇంగ్లిషుతో ఇబ్బంది పడుతున్నారు. 
44.6 శాతం మందికి నచ్చలే.. 
ఆన్​లైన్​ క్లాసులతో ఇబ్బంది పడుతున్నట్లు 44.6 శాతం మంది విద్యార్థులు తెలిపారు. 45.1 శాతం మంది విద్యార్థులు కరోనా సమయంలో ఆన్​లైన్​ క్లాసుల కారణంగా చదువులో వెనకబడ్డామని, ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని 45.1 శాతం మంది విద్యార్థులు వారి అభిప్రాయం చెప్పారు. పాండమిక్​ వల్ల తాము విపరీతమైన స్ట్రెస్​, టెన్షన్​, యాంగ్జయిటీకి గురయ్యామని 42.3 శాతం పిల్లలు తెలిపారు. 85.8 శాతం పిల్లలు తమకు యాక్టివిటీ, ప్రాజెక్ట్​ బేస్డ్​ విద్యాబోధన ఉంటేనే బాగా నేర్చుకోగలుతామని చెప్పారు.

ఈ సర్వే ఫలితాలు చూసిన తర్వాత ‘నిసా’ విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ పాఠశాల, ప్రభుత్వ స్థాయిలో జరగాల్సిన ప్రయత్నాలపై కొన్ని సూచ నలు చేసింది. వెంటనే పిల్లల్లో లాంగ్వేజ్​ స్కిల్స్​పెంచడానికి ప్రయత్నించాలని సూచించింది. టీచర్లకు కూడా భాషా బోధనలో శిక్షణ అవసరమని.. ప్రభుత్వాలు తమ నివేదికను పరిశీలించి, స్కూళ్లు ఆఫ్​లైన్​లో కొనసాగేలా కృషి చేసి. బడ్జెట్​స్కూళ్లను ఆర్థికంగా ఆదుకోవాలని కోరింది. 

 

ఇవి కూడా చదవండి

తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో వ్యక్తిపై రూ.81,944 అప్పు

90 వేల ఎకరాలకు పురుగు తగిలింది

తాను చనిపోతూ.. ఏడుగురికి పునర్జన్మ