సంగారెడ్డి బల్దియాలో అవిశ్వాస సెగ!

సంగారెడ్డి బల్దియాలో అవిశ్వాస సెగ!

సంగారెడ్డి/కంది, వెలుగు : సంగారెడ్డి బీఆర్ఎస్ లో ముసలం ముదిరి ఏకంగా మున్సిపల్​చైర్ పర్సన్ పదవికి ఎసరు పెట్టే పరిస్థితి నెలకొంది. సంగారెడ్డి మున్సిపల్ పాలకవర్గంలో పైసల పంచాయితీ సొంత పార్టీ చైర్ పర్సన్  విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానానికి దారి తీస్తోంది. ఏడాది కింద నారాయణఖేడ్ వేదికగా సీఎం కేసీఆర్ సంగారెడ్డి మున్సిపాలిటీకి ప్రకటించిన రూ.50 కోట్ల డెవలప్​మెంట్ పనులు ఇప్పుడు బీఆర్ఎస్ నేతల్లో గ్రూపులను తయారు చేశాయి. దీనికి తోడు చైర్ పర్సన్ భర్త ఒంటెత్తు పోకడ సొంత పార్టీ కౌన్సిలర్లకు నచ్చడం లేదు. ఈ క్రమంలో బీఆర్ఎస్ లో ఏర్పడిన రెండు గ్రూపులు ఇప్పుడు ఒక్కటై చైర్ పర్సన్ ను దింపేందుకు ప్లాన్ చేస్తున్నాయి. 

అవిశ్వాసం పెట్టాలంటే 20 మంది.. నెగ్గాలంటే 26 మంది.. 

సంగారెడ్డి గ్రేడ్ వన్ మున్సిపాలిటీలో 38 వార్డులు ఉన్నాయి. చైర్ పర్సన్ పై అవిశ్వాసం పెట్టాలంటే 20 మంది కౌన్సిలర్ల సంతకాల అవసరం ఉంటుంది. కానీ నెగ్గాలంటే అవిశ్వాసానికి సంబంధించిన మీటింగ్ లో 26 మంది సభ్యుల హాజరు ఉండాల్సిందే. బీఆర్ఎస్ కు 25 స్థానాలు, కాంగ్రెస్ కు 7, బీజేపీకి 3, ఎంఐఎంకు 2 స్థానాలు ఉన్నాయి. ఇప్పటివరకు 20 మంది సంతకాలు సేకరించినట్టు సమాచారం. కానీ అందులో ఎంతమంది లాస్ట్ వరకు నిలబడతారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏదేమైనా అవిశ్వాసం పెట్టడానికి సరిపడా కౌన్సిలర్ల మద్దతు ఉండేలా పక్కాగా ప్లాన్​ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారు బుధవారం రాత్రి ఓ బీఆర్ఎస్ కౌన్సిలర్ భర్తతో మీటింగ్ ఏర్పాటు చేసి మరి కొందరు కౌన్సిలర్ల మద్దతు కావాలని కోరినట్లు తెలిసింది. అయితే చైర్ పర్సన్ స్థానాన్ని తన భార్యకు అప్పగిస్తే మరో ఆరుగురు కౌన్సిలర్లను తీసుకొస్తానని సదరు కౌన్సిలర్ భర్త హామీ ఇచ్చినట్టు సమాచారం. 

మంత్రికి చెప్పినా నో రెస్పాన్స్..

సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ భర్త వ్యవహార తీరుపై మంత్రి హరీశ్​రావుతోపాటు స్థానిక మాజీ ఎమ్మెల్యే, చేనేత సహకార సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ దృష్టికి  తీసుకెళ్లినా ఫలితం లేదని ఆ కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే అందరూ కలిసి అవిశ్వాసం పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే అవిశ్వాసం విషయం తెలుసుకున్న చైర్ పర్సన్ విజయలక్ష్మి అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. 

రంగారెడ్డి జిల్లాలో అవిశ్వాస తీర్మానంపై కోర్టు స్టే ఇచ్చిన విషయాన్ని ఆసరా చేసుకుని ఆమె కూడా ముందుగానే కోర్టు ద్వారా స్టే తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు చైర్​పర్సన్​ వర్గీయులు చెబుతున్నారు. ఇదే క్రమంలో స్టే తీసుకురాకుండా ముందస్తు వ్యూహంపై వ్యతిరేక వర్గానికి చెందిన కౌన్సిలర్లు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంతో చివరికి ఏం జరుగుతుందోననే ఆసక్తి అందరిలో నెలకొంది.