
- మీడియాకు పాసుల జారీలో అయోమయం
- ఏర్పాట్లలో అధికారుల తీరుపై విమర్శలు
ఓయూ,వెలుగు: రెండేండ్ల తర్వాత నిర్వహిస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ 81వ కాన్వోకేషన్ను ఘనంగా నిర్వహిస్తున్నామంటున్న అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. నేడు జరగనున్న ఓయూ కాన్వోకేషన్‌కు హాజరవుతున్న ప్రముఖులు, పట్టాలు పొందే స్డూడెంట్లు, మీడియా ప్రతినిధులకు ఫొటోలు, క్యూఆర్ కోడ్ ఉన్న పాసులు, వెహికల్ పార్కింగ్‌కు పాసులు ఇస్తామని అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే వెహికల్ పార్కింగ్ చేయాల్సిన ప్లేస్‌ను చూపిస్తుందని చెప్పిన అధికారులు చాలా మందికి తెల్ల కాగితంపై ఫొటో అంటించి వాటినే ఎంట్రీ పాస్ గా ఇచ్చారు. వీటికి క్యూఆర్, బార్కోడ్ లేకపోవడంతో వెహికల్ పార్కింగ్ ఏరియాను ఎలా చూపిస్తుందని పాసులు తీసుకున్న వారు ప్రశ్నిస్తున్నారు.
ఈసారి కాన్వోకేషన్‌కు కేవలం రిపోర్టర్లకు మాత్రమే పర్మిషన్ ఇచ్చిన అధికారులు వీడియో, ఫొటో కెమెరాలను నిషేధించారు. ప్రోగ్రామ్‌కు సంబంధించిన లింక్‌లను తామే ఇస్తామని, ఫొటోలు సైతం అందరికీ అందజేస్తామని చెప్తున్నారు. అధికారులు తెల్లకాగితాలపై జారీచేసిన పాసులతో తమకు అనుమతి ఉంటుందో లేదోనని మీడియా ప్రతినిధులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. 2019 జూన్17న నిర్వహించిన 80వ కాన్వోకేషన్‌కు సైతం అధికారులు ఇలాంటి పాసులనే జారీ చేశారు. ప్రోగ్రామ్‌ను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులను ఆడిటోరియంలోకి అనుమతించలేదు. దీంతో మీడియా ప్రతినిధులు చేసేదేమీ లేక ఆడిటోరియం బయట ఏర్పాటు చేసిన స్క్రీన్ల వద్ద కూర్చుని ప్రోగ్రామ్‌ను కవర్ చేయాల్సి వచ్చింది. ఈ సారి కూడా ఇలాంటి పాసులనే జారీ చేయడంతో మరోసారి గతంలోలానే పరిస్థితే ఉంటుందని మీడియా ప్రతినిధులు పేర్కొంటున్నారు.