ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక జొమాటో డెలివరీ బాయ్‌కి సంబంధించిన వీడియో మంటలు పుట్టిస్తోంది. అర్ధరాత్రి వేళ కస్టమర్ ఆర్డర్ చేసిన బిర్యానీ, గులాబ్ జామూన్‌లను ఆ డెలివరీ బాయ్ రోడ్డు పక్కన కూర్చుని తింటున్న దృశ్యాలు ఇప్పుడు డోర్‌స్టెప్ డెలివరీ సర్వీస్‌పై కొత్త చర్చకు దారితీసింది. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైందంటే.. జొమాటో డెలివరీ బాయ్ ఈగో వర్సెస్ కస్టమర్ కన్వీనియన్స్ మధ్య జరిగిన వాదనతోనే.
అంకుర్ ఠాకూర్ అనే డెలివరీ ఏజెంట్ రాత్రి 2:30 గంటల సమయంలో ఆర్డర్ తీసుకుని వెళ్లాడు. లొకేషన్ చేరుకున్నాక.. కిందకు వచ్చి ఫుడ్ తీసుకోవాలని కస్టమర్‌కు కాల్ చేశాడు. కానీ ఆ కస్టమర్ మాత్రం తాను కిందకు రానని.. ఇంటి డోర్ వద్దకే వచ్చి ఫుడ్ ఇవ్వాలని పట్టుబట్టడమే కాకుండా ఫోన్‌లో డెలివరీ బాయ్‌పై గట్టిగా అరిచాడని సమాచారం. మేము డెలివరీ ఛార్జీలు కడుతున్నది అందుకే.. నువ్వు చెప్పింది వినాల్సిందే అంటూ కస్టమర్ అనడంతో అంకుర్ ఈగో దెబ్బతింది. దీంతో తాను కూడా పైకి రానని మొండికేయడంతో.. కస్టమర్ ఆగ్రహంతో ఆర్డర్‌ను క్యాన్సిల్ చేశాడు.
ఆర్డర్ క్యాన్సిల్ అవ్వడమే ఆలస్యం.. అంకుర్ ఆ ఫుడ్ ప్యాకెట్ విప్పి అక్కడే తినడం మొదలుపెట్టాడు. ఆ దృశ్యాలను వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతూ.. "వర్షం ఉన్నా, ఎండ ఉన్నా మేము కష్టపడి ఫుడ్ తెస్తాం. మాకు కావాల్సింది కొంచెం మర్యాద, ఓపిక మాత్రమే" అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఈ వీడియోపై నెటిజన్లు తమ అభిప్రాయాలను భిన్నంగా వ్యక్తం చేస్తున్నారు.
కొందరు ఇంటర్నెట్ యూజర్లు తాము డెలివరీ ఛార్జీలు, ప్లాట్‌ఫారమ్ ఫీజులు కట్టేదే ఇంటి గుమ్మం వద్దకు ఫుడ్ రావాలని.. అర్ధరాత్రి వేళ కస్టమర్ కిందకు రావాలని కోరడం ఏంటి? అంటూ ఫైర్ అవుతున్నారు. ఇది డెలివరీ బాయ్ బాధ్యతారాహిత్యం అని విమర్శిస్తున్నారు. మరోవైపు డెలివరీ ఏజెంట్లకు మద్దతుగా నిలుస్తున్న వారు.. మనిషి అన్నాక కాస్త గౌరవం ఇవ్వాలి.. మర్యాదగా అడిగితే ఎవరైనా పైకి వస్తారు కానీ అధికారం చలాయిస్తే కుదరదంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి 'సర్వీస్' అనే పదానికి 'బానిసత్వం' అని అర్థం కాదని ఒకరు.. డ్యూటీ అంటే పూర్తి చేయాల్సిందేనని మరొకరు వాదించుకుంటున్నారు. మెుత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
