Varun Tej Lavanya : మెగా వారసుడు 'వాయువ్'తో తొలి సంక్రాంతి.. వరుణ్-లావణ్య క్యూట్ ఫోటోస్ వైరల్!

Varun Tej Lavanya : మెగా వారసుడు 'వాయువ్'తో తొలి సంక్రాంతి.. వరుణ్-లావణ్య క్యూట్ ఫోటోస్ వైరల్!

సంక్రాంతి పండుగ అంటేనే కుటుంబ సభ్యుల సందడి, పిండి వంటలు, కొత్త బట్టల హడావిడి. మెగా కుటుంబంలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు రెట్టింపు అయ్యాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మెగా కోడలు లావణ్య త్రిపాఠి తమ ముద్దుల కుమారుడు 'వాయువ్ తేజ్' తో కలిసి మొట్టమొదటి సంక్రాంతి వేడుకలను ఎంతో వైభవంగా జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

వాయువ్‌తో ఫస్ట్ పండుగ..

తమ వారసుడితో కలిసి జరుపుకుంటున్న ఈ తొలి పండుగకు సంబంధించిన ఫోటోలను ఈ జంట సోషల్ మీడియాలో పంచుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న ఈ దంపతులు, తమ చిట్టి తండ్రి వాయువ్‌ను ఎత్తుకుని దిగిన ఫోటోలు నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి. "వాయువ్‌తో మా తొలి సంక్రాంతి.. ఇది మాకు ఎంతో ప్రత్యేకం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు" అంటూ లావణ్య పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఫోటోలపై మెగా అభిమానులు 'లిటిల్ మెగా ప్రిన్స్' అంటూ ప్రేమపూర్వక కామెంట్లతో ముంచెత్తుతున్నారు.

పేరు వెనుక ప్రత్యేక ఇదే..

గతేడాది సెప్టెంబర్ 10న వరుణ్-లావణ్య దంపతులకు బాబు జన్మించిన సంగతి తెలిసిందే. బాబు పుట్టినప్పటి నుంచి మెగా అభిమానుల్లో పేరు పట్ల ఎంతో ఉత్కంఠ నెలకొంది. ఇటీవల నిర్వహించిన బారసాల వేడుకలో తన కుమారుడికి 'వాయువ్ తేజ్' అని నామకరణం చేశారు. హనుమంతుడి పర్యాయపదాల్లో ఒకటైన 'వాయుపుత్ర' నుంచి స్ఫూర్తి పొంది ఈ పేరును ఖరారు చేశారు. వరుణ్ తన పేరులోని 'తేజ్'ను కూడా జతచేసి తన వారసుడికి విలక్షణమైన గుర్తింపునిచ్చారు.

ఏడేళ్ల ప్రేమ.. వైవాహిక బంధం

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ప్రేమకథ ఒక సినిమాను తలపిస్తుంది. 'మిస్టర్', 'అంతరిక్షం' వంటి చిత్రాల్లో కలిసి నటించిన ఈ ఇద్దరూ దాదాపు ఏడేళ్ల పాటు సీక్రెట్ రిలేషన్‌లో ఉన్నారు. ఎక్కడా చిన్న పుకారు కూడా రాకుండా జాగ్రత్త పడిన ఈ జంట, 2023లో ఇటలీలోని టస్కనీలో అట్టహాసంగా వివాహం చేసుకున్నారు.  నాగబాబు తనయుడిగా 'ముకుంద'తో ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్, 'కంచె', 'ఫిదా'  వంటి వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 

ప్రస్తుతం వరుణ్ తన తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, లావణ్య కూడా తన కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తూ గృహిణిగా, తల్లిగా కొత్త బాధ్యతలను ఆస్వాదిస్తోంది. వాయువ్ రాకతో వరుణ్-లావణ్యల జీవితంలో ఈ సంక్రాంతి సరికొత్త వెలుగులను నింపింది. ఈ చిన్నారి రాకతో మెగా ఫ్యామిలీలో పండగ కళ ముందే వచ్చేసింది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.