ఆస్ట్రేలియా మాజీ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినా తనలో ఫామ్ ఇంకా ఉందని తెలియజేసే ఇన్నింగ్స్ ఆడాడు. ఫామ్ పర్మినెంట్.. క్లాస్ శాశ్వతం అని నిరూపించాడు. 39 ఏళ్ళ వయసులో సెంచరీ చేయి తనలో ఇంకా పరుగులు చేయగల సత్తా ఉందని విమర్శకులకు సమాధానం చెప్పాడు. బిగ్ బాష్ లీగ్ లో భాగంగా శుక్రవారం (జనవరి 16) జరిగిన మ్యాచ్ లో సిడ్నీ థండర్ తరపున ఆడుతున్న వార్నర్.. సిడ్నీ సిక్సర్స్ పై సెంచరీతో చెలరేగాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్ లో వార్నర్ కేవలం 65 బంతుల్లో 169.23 స్ట్రైక్ రేట్‌తో అజేయంగా 110 పరుగులు చేశాడు.
వార్నర్ తన సెంచరీతో టీ20 క్రికెట్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డ్ ను బ్రేక్ చేశాడు. తాజా సెంచరీతో వార్నర్ టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో ప్లేయర్ గా నిలిచాడు. ఈ క్రమంలో కోహ్లీని ఈ ఆసీస్ మాజీ ఓపెనర్ వెనక్కి నెట్టాడు. వార్నర్ టీ20 క్రికెట్ లో ఇది 10 వ సెంచరీ కాగా.. కోహ్లీ, సౌతాఫ్రికా ప్లేయర్ రిలీ రోసోవ్‌లు చెరో తొమ్మిది సెంచరీలతో సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచారు. ఓవరాల్ గా క్రిస్ గేల్ 22 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ బాబర్ అజామ్ 11 సెంచరీలతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు.
వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పినా ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ కేవలం ఎనిమిది మ్యాచ్‌ల్లో 463 పరుగులతో పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. వార్నర్ సెంచరీతో చెలరేగాడు. ఛేజింగ్ లో సిడ్నీ సిక్సర్స్ 17.2 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసి గెలిచింది. స్మిత్ 41 బంతుల్లోనే సెంచరీ చేసి ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు.
