నాన్న సరిగ్గా లేకనే మనకీ బాధలు..నా కోసం ఇక వెతకవద్దు..తల్లికి వీడియో పంపి కొడుకు మిస్సింగ్

 నాన్న సరిగ్గా లేకనే మనకీ బాధలు..నా కోసం ఇక వెతకవద్దు..తల్లికి వీడియో పంపి కొడుకు మిస్సింగ్

ఉప్పల్, వెలుగు: తండ్రి ప్రవర్తనతో విసిగిపోయి ఓ యువకుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ‘‘ నన్ను ఎవరూ వెతకవద్దు.. నేను మీకు దొరికినా మళ్లీ వెళ్లిపోతాను. నాన్న సరిగ్గా లేకపోవడం వల్లే మనకు ఈ బాధలు’’ అని సెల్ఫీ వీడియో తీసి తల్లికి వాట్సాప్​లో పంపాడు. ఉప్పల్ పరిధిలోని రామంతాపూర్ వెంకట్​రెడ్డి నగర్​కు చెందిన పి. పద్మ, శంకర్ల కొడుకు మహేశ్ అలియాస్ నాని (23) పాలు డోర్ డెలివరీ చేస్తూ, మరోవైపు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. 

తండ్రి శంకర్ ఏ పని చేయకుండా తిరుగుతుండటంతో ఈ నెల 5న కుటుంబ పోషణ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్థాపానికి లోనైన మహేశ్.. బుధవారం తెల్లవారుజామున పాలు వేయడానికి అని ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. తల్లి పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోగా.. చివరకు ఆవేదనతో కూడిన వీడియోను పంపి అదృశ్యమయ్యాడు. దీనిపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో ఉప్పల్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.