
- ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో డీఈఈ రమేశ్ కోచింగ్ సెంటర్
- పేపర్ లీకేజ్ నిందితుడు సురేశ్ ద్వార ఏఈ మాస్టర్ పేపర్
- సైదాబాద్ నుంచి సప్లయ్ చేసిన డీఈఈ రమేశ్
- తన కోచింగ్ సెంటర్‌లో 20 మందికి పైగా పేపర్ సేల్
హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ పేపర్స్ లీకేజీ కేసులో రోజుకో కొత్త కోణం బయటపడుతున్నది. సిట్ దర్యాప్తులో ఎన్పీడీసీఎల్ డీఈఈ రమేశ్ కోచింగ్ సెంటర్స్ గుట్టురట్టైంది. దీంతో పాటు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, దిల్‌సుఖ్‌నగర్‌లోని మరో మూడు కోచింగ్ సెంటర్స్‌కు పేపర్ లీకేజీతో లింకులు ఉన్నట్లు సిట్ గుర్తించింది. ఇందులో డీఈఈ రమేశ్ తన భార్య పేరిట ఓ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. తమ వద్ద కోచింగ్ తీసుకునే అభ్యర్ధులకు జాబ్ గ్యారింటీ ఆఫర్ చేశారు. జాబ్ రాకపోతే ఫీజ్ వాపస్ చేస్తామని ప్రచారం కూడా చేసుకున్నాడు. ఇదే తరహాలో సిటీలోని పలు కోచింగ్ సెంటర్స్ నిర్వాహకులకు ఈ కేసులో నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి, రేణుక ద్వారా డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉన్నట్లు తేలింది. ప్రవీణ్ గ్యాంగ్ అందించిన మాస్టర్ పేపర్స్‌తో కోచింగ్ సెంటర్స్‌లో ట్రైనింగ్ ఇచ్చారు.
డీఈఈ రమేశ్ టార్గెట్.. ఏఈఈ మాస్టర్ పేపర్
టీఎస్‌పీఎస్‌సీ నుంచి లీకైన ఆరు మాస్టర్ పేపర్స్‌లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ మినహా ఏఈ, ఏఈఈ, డీవోవో పేపర్స్‌ను రూ.లక్ష నుంచి రూ.3లక్షల వరకు సేల్ చేశారు. నాలుగు టీమ్స్‌గా ఏర్పడి పేపర్స్ అమ్మకానికి పెట్టారు. ప్రవీణ్ ద్వారా అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష రాసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ బీ నర్సింగ్‌రావును ఆదివారం అరెస్ట్ చేశారు. టీఎస్‌పీఎస్‌సీ మాజీ టెక్నిషియన్ సురేశ్ వద్ద డీఈ రమేశ్ ఏఈ పేపర్స్ కొనుగోలు చేశాడు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయ్ కావడంతో అదే అసిస్టెంట్ ఇంజినీర్ పేపర్‌ను మార్కెట్‌లో పెట్టాడు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని తన కోచింగ్ సెంటర్‌లో దాదాపు 20 మందికి పైగా మాస్టర్ పేపర్‌తో కోచింగ్ ఇచ్చాడు. పరీక్షకు సరిగ్గా రెండు రోజుల ముందు అభ్యర్ధులకు పేపర్స్ అందించారు.
సైదాబాద్ నుంచే సప్లయ్
సైదాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్ అడ్డాగా ఏఈఈ పేపర్ లీకేజీ జరిగినట్టు సిట్ గుర్తించింది. అదే అపార్ట్‌మెంట్‌లో నిందితుడు సురేష్, ఎలక్ట్రికల్ జూనియర్ అసిస్టెంట్ పూల రవికిశోర్, డీఈ రమేశ్ నివాసం ఉంటున్నారు. ఇక్కడి నుంచే ఏఈ పేపర్స్ సప్లయ్ చేశారు. సైదాబాద్‌లోని ఓ జిరాక్స్ సెంటర్‌లో ఏఈ మాస్టర్ పేపర్స్ జిరాక్స్ తీశారు. వాటిని రవికిశోర్ బావమరిది విక్రమ్, అతని మరదలు దివ్యలకు అందించాడు. వీరితో పాటు డీఈ రమేశ్ వరంగల్‌కు చెందిన వాడు కావడంతో ఆ జిల్లాకు చెందిన అభ్యర్ధులు, తన కోచింగ్ సెంటర్ అభ్యర్ధులకు పేపర్ సేల్ చేశాడు. ఒక్కో అభ్యర్ధి వద్ద డిమాండ్‌ను బట్టి రూ.75 వేల నుంచి రూ.3లక్షల వరకు విక్రయించారు. రమేశ్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా కోచింగ్ సెంటర్స్‌పై సిట్ గురి పెట్టింది. అభ్యర్ధులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది.