స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ గల్లంతు.. కాంగ్రెస్తోనే జీపీలు డెవలప్ అవుతయ్

స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ గల్లంతు..  కాంగ్రెస్తోనే జీపీలు డెవలప్ అవుతయ్
  • పదేండ్ల పాలనలో పంచాయతీలను పట్టించుకోలే..: మంత్రి వివేక్
  •     గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం
  •     పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నం
  •     కాంగ్రెస్ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని వ్యాఖ్య
  •     మంచిర్యాల జిల్లా కోటపల్లి, చెన్నూరులో ప్రచారం

కోల్​బెల్ట్/కోటపల్లి, వెలుగు:స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ గల్లంతు అవుతుందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్.. గ్రామ పంచాయతీలను పట్టించుకోలేదని విమర్శించారు. జీపీలు డెవలప్ కావాలంటే కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి, చెన్నూరు మండలాల్లో మూడో విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో కాంగ్రెస్ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ఆదివారం ఆయన ప్రచారం చేశారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్​ల్లో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్, డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్​రెడ్డితో కలిసి మంత్రి వివేక్ మాట్లాడారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఒక్క రేషన్ కార్డూ ఇవ్వలేదని విమర్శించారు.

 కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. 17 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 

‘‘జనవరిలో ప్రతి నియోజకవర్గానికి మరో 3,500 ఇండ్ల చొప్పున మంజూరు చేస్తాం. అర్హులందరికీ రేషన్​కార్డులు ఇచ్చినం. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలతో ప్రజలు సంతోషంగా ఉన్నరు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నం’’అని మంత్రి వివేక్ అన్నారు.

రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చింది

రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందని వివేక్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ‘‘రూ.60 వేల కోట్లు ఖర్చు చేసినా.. మిషన్ భగీరథ స్కీం ద్వారా చుక్క నీరు రాలేదు. 

ఇంటికో ఉద్యోగం.. నిరుద్యోగ భృతి అంటూ ప్రజలను బీఆర్ఎస్ నమ్మించి మోసం చేసింది. ఆ పార్టీ లీడర్లు తప్పుడు హామీలతో మళ్లీ ఓట్ల కోసం వస్తున్నరు. బీఆర్ఎస్ బడా లీడర్లు దొడ్డు బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తూ దందాలు చేశారు. కల్యాణలక్ష్మి లబ్ధిదారుల నుంచి కమీషన్లు గుంజిన్రు. ప్రజాపాలనపై ఉన్న నమ్మకంతో జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్​ను గెలిపించారు’’అని వివేక్ పేర్కొన్నారు.

రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు

చెన్నూరు నియోజకవర్గంలో రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపడ్తామని మంత్రి వివేక్ అన్నారు. ‘‘నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే, మంత్రిని అయ్యాను. వారి సంక్షేమం, అభివృద్ధి నా బాధ్యత. కాకా వెంకటస్వామి కుటుంబం ఎల్లప్పుడు ప్రజలకు సేవలు చేస్తున్నది. అందుకే ప్రజలంతా నా తండ్రిని, అన్నను, కొడుకును, నన్ను గెలిపించారు. 

విశాక ట్రస్ట్ ద్వారా గ్రామాలు, పట్టణాల్లో బోర్లు వేయించినం. స్కూల్స్​కు బెంచీలు పంపిణీ చేసినం. నేను రిక్వెస్ట్ చేస్తే మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్​ కోటపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి అలూరి సంపత్​కు మద్దతుగా నిలిచారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కుటుంబానికి అవకాశం కల్పిస్తాం’’అని మంత్రి వివేక్ హామీ ఇచ్చారు. జనవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. 

బాధిత రైతులకు పరిహారం ఇప్పించిన

కాళేశ్వరం బ్యాక్​వాటర్ తో చెన్నూరు నియోజకవర్గంలోని రైతులు నాలుగేండ్ల పాటు పంటలు నష్టపోయినా బీఆర్ఎస్ పాలకులు పట్టించుకోలేదని మంత్రి వివేక్ మండిపడ్డారు. ‘‘నేను ఎమ్మెల్యే అయ్యాక బాధిత రైతులకు పరిహారం ఇప్పించిన. నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులు రూ.10 కోట్లు కలెక్టర్ వద్ద ఉన్నాయి. ఈ నెల 19, 20వ తేదీల్లో రైతులకు చెల్లిస్తం. మరో రూ.23 కోట్ల పరిహారం రావాల్సి ఉంది. 

మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డితో ఇప్పటికే మాట్లాడిన. త్వరలో వాటిని రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చారు’’అని వివేక్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ద్వారా రాష్ట్రానికి రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, రాబోయే రోజుల్లో లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు వస్తాయని చెప్పారు.