దళిత బంధు పథకం పేరుపై అభ్యంతరం

 దళిత బంధు పథకం పేరుపై అభ్యంతరం
  • జాతీయ కమిషన్ కు ఫిర్యాదు చేసిన మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రామ్ ప్రసాద్
  • "తెలంగాణ దళిత బంధ" పేరును "తెలంగాణ అంబేద్కర్ బంధు" గా మార్చి అమలు చేయాలని డిమాండ్
  • రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన జాతీయ ఎస్సీ కమిషన్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన దళిత పథకం పేరుపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. రాజ్యాంగం నిషేధించిన పదాన్ని ఎలా ఉపయోగిస్తారంటూ మాలల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రామ్ ప్రసాద్ ఎస్సీ జాతీయ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. "తెలంగాణ దళిత బందు"ను "తెలంగాణ అంబేద్కర్ బంధు" గా మార్చి అమలు చెయాలని కోరారు. ఫిర్యాదుపై కమిషన్ స్పందించింది. గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది జాతీయ ఎస్సీ కమిషన్. 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన తెలంగాణ దళిత బంధు పథకం పేరుతో జిఓ ఎంఎస్ నెంబర్ 6 తేదీ 18-7-2021 తెలంగాణ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ జీవో జారీ చేయడం జరిగిందని, రాజ్యాంగంలో ఎక్కడా లేని, వాడని ‘‘దళిత’’ అనే పదం ఉపయోగిస్తున్నారని.. కాబట్టి దళిత అనే పదాన్ని తొలగించి అంబేద్కర్ అనే పదాన్ని చేర్చాలని మాలల సంఘం అధ్యక్షుడు బత్తుల రామ్ ప్రసాద్ జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ హల్దర్ కలిసి ఫిర్యాదు చేశారు. ‘‘దళిత’’ అనే పదానికి అర్ధాలు అంటరానివారు/నిస్సహాయులు/తక్కువ  వారు అనే అర్ధాలు గల ఈ పదం పై గత 1982 నుండి 15-3-2018 వరకు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కేంద్రం స్పందించి సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నుండి దళిత అనే పదాన్ని అధికారికంగా వాడడం నివారించాలని అన్ని రాష్ట్రాల సెక్రటరీలకు లేఖలు రాశారు. ఇలా నివారించ బడ్డ దళిత్ అనే పదాన్ని తిరిగి ఉపయోగిస్తూ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్ట్ ఆదేశాలను పెడచెవిన పెడుతోందని ఆయన ఆరోపించారు. భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో "తెలంగాణ అంబేద్కర్ బంధు" గా పేరును మార్చాలన్నారు.  తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కు 15 రోజులలో జవాబు ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేస్తున్నట్లు ఎస్సీ కమిషన్ వైస్ ఛైర్మన్ హామీ ఇచ్చారని మాలల సంక్షేమ సంఘం అధ్యక్షులు బత్తుల రామ్ ప్రసాద్ మీడియాకు తెలిపారు.