ఎన్నికల వేళ సర్కార్ భూములు కబ్జా .. అక్రమార్కులకు కలిసివచ్చిన అవకాశం

ఎన్నికల వేళ సర్కార్ భూములు కబ్జా .. అక్రమార్కులకు కలిసివచ్చిన అవకాశం

ఎల్​బీనగర్, వెలుగు:  ఎన్నికల వేళ సమయం చూసుకుని కబ్జాదారులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. నాగోల్ డివిజన్ బండ్లగూడ పరిధిలోని ఫతుల్లగూడ  సర్వే నం.58లో ఉన్న ప్రభుత్వ స్థలం ఓపెన్​గా ఉంది.  ఇందులో గతంలో ఉప్పల్ రెవెన్యూ అధికారులు కొంత  జాగా ఆట స్థలానికి,  మరి కొంత స్థలం బస్తీ దవాఖానుకు కేటాయించారు.  రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో స్థానికంగా అధికారులు, స్థానిక నేతలు అందరూ బిజీగా అయ్యారు.

ఇదే అదునుగా భావించిన కబ్జాదారులు ప్రభుత్వ స్థలాన్ని హాంఫట్ చేస్తున్నారు.  సర్వే నంబర్ 58లోని ఖాళీ స్థలంలో రాత్రికి రాత్రే  మట్టిని నింపుతూ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు.  ఈ విషయంపై మంగళవారం స్థానికులు ఉప్పల్ మండల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.  దీంతో నాగోల్​ పోలీస్ స్టేషన్ సిబ్బంది బందోబస్తు మధ్య ఉప్పల్ మండల రెవెన్యూ అధికారులు సర్వే నం.58 కు వచ్చి అక్రమ నిర్మాణాలను పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఇదంతా కొంతమంది అధికారుల సహకారంతో జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.