- రెండేళ్లలో 'కొడంగల్' స్కీంను పూర్తి చేస్తాం
- పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
మహబూబ్‌నగర్, వెలుగు: 'కొడంగల్' స్కీం కింద భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం న్యాయమైన పరిహారం అందిస్తోందని, ఈ డబ్బును వృథా చేసుకోకుండా రైతులు మళ్లీ భూములు కొనుక్కోవాలని పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. ఆదివారం నారాయణపేట ఆర్డీవో ఆఫీసులో మక్తల్--నారాయణపేట--కొడంగల్ స్కీం భూ నిర్వాసితులకు పరిహారం చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రూ.4,500 కోట్లతో చేపటనున్న ఈ స్కీంను రెండేండ్లలో పూర్తి చేస్తామన్నారు. బాధితులకు పరిహారం డబ్బులు ఇచ్చాకే ప్రాజెక్ట్ పనులు చేపడుతున్నామన్నారు. గత ప్రభుత్వం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా నది నుంచి నీళ్లను లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నా, కమీషన్ల కోసం 330 కిలోమీటర్ల దూరం తిప్పి నీళ్లను తెచ్చే ప్రయత్నం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నారాయణపేట ప్రాంతం వర్షాధారిత ప్రాంతం అని, ఇక్కడ ప్రాజెక్ట్ కట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. దానికి 'కొడంగల్' స్కీమ్ ఒక్కటే శరణ్యమన్నారు. సీఎం మన ప్రాంతం బిడ్డ కాబట్టే భూ నిర్వాసితులకు పరిహారం డబ్బులను ఎకరానికి రూ.14 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచారన్నారు.
దేశంలో ఏ ప్రాజెక్టు కింద కూడా ఇంత పెద్ద మొత్తంలో పరిహారం ఇవ్వలేదని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీవో రామచంద్ర నాయక్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కుంభం శివకుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
