సిద్దిపేట టౌన్, వెలుగు: కొత్తగా ఎన్నికైన సర్పంచులు గ్రామాలను ఆదర్శంగా మార్చాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కివెంకటయ్య సూచించారు. ఆదివారం దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో సిద్దిపేట ఎంపీడీవో ఆఫీస్ లో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ సర్పంచ్, ఉప సర్పంచులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అనంతరం మాట్లాడుతూ..పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు. పార్టీలకు అతీతంగా నిధులు సేకరించి గ్రామంలోని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి శంకర్, ప్రతినిధులు శంకర్, స్వామి, పోతరాజు శంకర్, తిరుపతి, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దేవి రవీందర్, తిమ్మాపూర్ సర్పంచ్ శ్రీనివాస్, వేణు, సుల్తానా, రాజు, రాంచద్రం పాల్గొన్నారు.
6న జిల్లాలో తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన
సంగారెడ్డి టౌన్: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌తో పాటు సభ్యులు ఈ నెల 6న సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఈ నెల 6న ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి కోహిర్ మండలం సజ్జాపూర్ గ్రామానికి చేరుకుని బ్యాగరి రాములుకు నష్ట పరిహారాన్ని అందజేస్తారన్నారు.
అనంతరం జహీరాబాద్ మండలం రంజోల్‌లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ జూనియర్ కాలేజీని సందర్శిస్తారన్నారు. అనంతరం సంగారెడ్డి కలెక్టరేట్‌కు చేరుకుని జిల్లా స్థాయి సమావేశం నిర్వహిస్తారని, భూ సమస్యలు, అట్రాసిటీ కేసులపై చర్చిస్తారని చెప్పారు. అధికారులందరూ హాజరుకావాలని ఆదేశించారు.
