
న్యూఢిల్లీ: డిమాండ్ తగ్గుదల, అధిక బేస్ ఎఫెక్ట్‌ల మధ్య ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది ఏప్రిల్–-జూన్ మధ్య కొత్త ఆఫీస్ స్పేస్ సరఫరా 25 శాతం తగ్గి 11.30 మిలియన్ చదరపు అడుగులకు పడిపోయింది. బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ ఇటీవల తన క్వార్టర్ ఆఫీస్ మార్కెట్ రిపోర్ట్ విడుదల చేసింది. ఏడు నగరాల్లోని మొత్తం ఆఫీస్ లీజింగ్ గత ఏప్రిల్-–జూన్ మధ్య కాలంలో 14.8 మిలియన్ చదరపు అడుగులతో పోలిస్తే ఈసారి 6 శాతం తగ్గి 13.9 మిలియన్ చదరపు అడుగులకు పడిపోయింది. గ్లోబల్ మార్కెట్లలో ఇబ్బందుల కారణంగా కంపెనీలు ఆఫీస్ స్పేస్ లీజింగ్ విషయంలో త్వరగా నిర్ణయాలు తీసుకోవడం లేదు. బేస్ ఎఫెక్ట్ కారణంగా కొత్త కంప్లీషన్లు (ఆఫీస్ స్పేస్) 2023 రెండో క్వార్టర్లో వార్షికంగా 25 శాతం తగ్గాయని వెస్టియన్ 'ది కనెక్ట్ క్యూ2 2023' రిపోర్ట్‌లో తెలిపింది. కొత్త కంప్లీషన్లు మాత్రం ఈ సంవత్సరం జనవరి–-మార్చిలో 8.60 మిలియన్ చదరపు అడుగుల నుంచి జూన్ క్వార్టర్లో 11.30 మిలియన్ చదరపు అడుగులకు పెరిగాయి.
బెంగళూరు... 21 శాతం డౌన్
ఈ క్యాలెండర్ సంవత్సరంలో ఏప్రిల్-–జూన్ కాలంలో ఆఫీస్ స్పేస్ సప్లై బెంగళూరులో సంవత్సరానికి 21 శాతం క్షీణించి 3.5 మిలియన్ చదరపు అడుగులకు పడిపోయింది. చెన్నైలో కొత్త ఆఫీస్ స్పేస్ సరఫరా 75 శాతం పెరిగి 2.10 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. కోల్‌కతాలో జూన్ క్వార్టర్లో కొత్త సరఫరా లేదు. హైదరాబాద్‌లో కొత్త సరఫరా 9 శాతం తగ్గి 4.10 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. ముంబైలో కూడా కొత్త సరఫరాలో 86 శాతం (0.30 మిలియన్ చదరపు అడుగులకు) పడిపోయింది. పూణేలో కొత్త ఆఫీస్ స్పేస్ సరఫరా 56 శాతం తగ్గి 0.80 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. ఢిల్లీ–-ఎన్సీఆర్లో, ఏప్రిల్-– జూన్ మధ్యకాలంలో కొత్త ఆఫీస్ స్పేస్ సరఫరా ఏడాది ప్రాతిపదికన 79 శాతం తగ్గి 0.50 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. ప్రస్తుత క్వార్టర్లో హైదరాబాద్‌లో అనేక పెద్ద ఆఫీస్ భవనాలు పూర్తయ్యాయని, కొత్త కంప్లిషన్లు 4 మిలియన్ చదరపు అడుగులకుపైగా ఉన్నాయని వెస్టియన్ తెలిపింది. 2023 క్యూ2లో (ఏప్రిల్–-జూన్) 2023లో మొత్తం సరఫరాలో హైదరాబాద్ 36 శాతం వాటాను కలిగి ఉండగా, బెంగళూరు 31 శాతం వాటాతో రెండోస్థానంలో ఉంది.