రూపు రేఖలు మారనున్న ఆన్‌లైన్ బిజినెస్

రూపు రేఖలు మారనున్న ఆన్‌లైన్ బిజినెస్
  • చిన్న వ్యాపారాలకు ఎంతో మేలు 
  • ఫ్లిప్కార్ట్, అమెజాన్లకు కళ్లెం వేయడానికే..

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌: ఓపెన్‌‌ నెట్‌‌వర్క్‌‌ ఫర్‌‌‌‌ డిజిటల్ కామర్స్‌‌ (ఓఎన్‌‌డీసీ) దేశంలోని ఆన్‌‌లైన్‌‌ బిజినెస్‌‌ల రూపు రేఖలను మార్చేస్తుందనే అంచనాలు పెరిగాయి. యూపీఐ టెక్నాలజీ మాదిరే ఓఎన్‌‌డీసీ కూడా బాగా విస్తరిస్తుందనే  అంచనాలూ ఎక్కువయ్యాయి.  ప్రస్తుతం ఈ టెక్నాలజీని ఐదు సిటీలలో పైలెట్‌‌ ప్రాజెక్ట్‌‌గా అమలు చేస్తున్నారు. ఓఎన్‌‌డీసీని తేవడానికి అనేక కారణాలు ఉన్నాయి. దేశంలో ఈ–కామర్స్ బిజినెస్ వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం రూ.75 లక్షల కోట్ల  మార్కెట్‌‌ సైజు ఉన్న ఈ సెగ్మెంట్‌‌లో,  80 శాతం వాటా  కేవలం రెండు (అమెజాన్‌‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌) కంపెనీల చేతుల్లోనే  ఉంది. అంటే 100 మంది ఆన్‌‌లైన్‌‌లో ఆర్డర్లు పెడుతుంటే ఇందులో 80 మంది అమెజాన్, ఫ్లిప్‌‌కార్ట్‌‌లలోనే ఆర్డర్లు పెడుతున్నారని అర్థం. దీంతో లోకల్‌‌గా ఉండే కంపెనీల ప్రొడక్ట్‌‌లు గాని, బ్రాండ్లుగాని  ఈ పెద్ద కంపెనీలు ప్రాధాన్యం ఇచ్చే ప్రొడక్ట్‌‌లు లేదా సొంత బ్రాండ్లతో పోటీ పడలేకపోతున్నాయి. అంతేకాకుండా వీటితో పోటీపడి రేట్లను తగ్గించి మార్కెట్‌‌లో కొనసాగలేకపోతున్నాయి. అదే ఓఎన్‌‌డీసీ అమల్లోకి వస్తే చిన్న కంపెనీలు కూడా కన్జూమర్ల దృష్టికి రాగలుగుతాయి. అంతేకాకుండా చిన్న కంపెనీలు  ప్రాంతం బట్టి, రేట్లు బట్టి  ప్లాట్‌‌ఫామ్‌‌ను, లాజిస్టిక్‌‌ సర్వీస్‌‌లను కూడా ఓఎన్‌‌డీసీ ద్వారా ఎంచుకోవచ్చు.   

ఓఎన్‌‌డీసీ అంటే?

ఓఎన్‌‌డీసీ ఒక ఓపెన్ ప్రోటోకాల్ నెట్‌‌వర్క్‌‌. అంటే ఎవరైనా ఈ నెట్‌‌వర్క్‌‌లోకి  జాయిన్‌ అవ్వొచ్చు. అమెజాన్‌‌, ఫ్లిప్‌‌కార్ట్ వంటి ప్లాట్‌‌ఫామ్‌‌లలోకి యాడ్ కావాలంటే సెల్లర్లు వివిధ ప్రాసెస్‌‌లను పూర్తి చేయాలి. ఫీజులు కట్టాల్సి ఉంటుంది. కస్టమర్లకు చిన్న వ్యాపారుల ప్రొడక్ట్‌‌లు అంత ఈజీగా కనిపించవు కూడా. అదే ఓఎన్‌‌డీసీలో మొబిలిటీ (క్యాబ్‌‌ సర్వీస్‌‌లు వంటివి), లాజిస్టిక్స్‌‌, గ్రోసరీ, ఫుడ్‌‌, హోటల్‌‌ బుకింగ్స్‌‌, ట్రావెల్‌‌ వివిధ సెగ్మెంట్‌‌లకు చెందిన  వ్యాపారులు జాయిన్ అవ్వడానికి వీలుగా ఉంటుంది. తమ సర్వీస్‌‌లను, ప్రొడక్ట్‌‌లను ఆన్‌‌లైన్‌‌లో అమ్ముకోవడానికి వీలుంటుంది.  ఓఎన్‌‌డీసీలో చిన్న, పెద్ద బ్రాండ్లకు ఒకే విధమైన ప్రాధాన్యం ఇస్తారు. కాబట్టి కస్టమర్లకు ఎక్కడో మధ్యప్రదేశ్‌‌ అడవుల్లో తయారయ్యే ప్రొడక్ట్‌‌లు కూడా  ఓఎన్‌‌డీసీ ప్లాట్‌‌ఫామ్‌‌లో కనిపిస్తాయి. కాగా, కిందటేడాది డిసెంబర్ 31 న ఓఎన్‌‌డీసీ లాంచ్ చేశారు. లాభాల కోసం పనిచేయని కంపెనీగా దీనిని తీసుకొచ్చారు.  ఈ నెట్‌‌వర్క్‌‌ను యూపీఐ టెక్నాలజీని  డెవలప్‌‌ చేసిన నందన్ నిలేకని నాయకత్వంలోని టీమ్‌‌  క్రియేట్ చేసింది. ప్రస్తుతం  ఢిల్లీ, బెంగళూరు, భోపాల్‌‌, షిల్లాంగ్‌‌, కోయంబత్తూర్‌‌‌‌ సిటీలలో ఓఎన్‌‌డీసీని పైలెట్‌‌ ప్రాజెక్ట్‌‌గా అమలు చేస్తున్నారు.    

ఓఎన్‌‌డీసీ ఎందుకు ముఖ్యమంటే..

దేశంలోని కన్జూమర్లు బ్రాండ్లను నమ్ముతుంటారు. ఏదైనా బ్రాండ్‌‌ మనకు నచ్చితే ఉప్పు నుంచి విమాన ప్రయాణాల వరకు అన్ని అవసరాలకు ఆ బ్రాండ్‌‌ వైపే చూస్తుంటాం. అందుకే  చిన్న వ్యాపారులు, తయారీ కంపెనీలు తమ కంటూ బ్రాండ్‌‌ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఓఎన్‌‌డీసీ సాయపడుతుందని చెప్పొచ్చు.  చిన్న బిజినెస్‌‌లు, తయారీ కంపెనీలు  తమ ప్రొడక్ట్‌‌లను, సర్వీస్‌‌లను  ఆన్‌‌లైన్‌‌లో కూడా కస్టమర్లకు అందుబాటులో ఉంచడానికి ఈ నెట్‌‌వర్క్ సాయపడుతుంది. ఓఎన్‌‌డీసీ ద్వారా బిజినెస్ టూ కన్జూమర్ (బీ2సీ) మాత్రమే కాకుండా, బిజినెస్‌‌ టూ బిజినెస్ డీల్స్‌‌ను పొందడానికి కూడా వ్యాపారులకు వీలుంటుంది. ఉదాహరణకు లోకల్‌‌ హెల్త్‌‌ బ్రాండ్ ఒకటి తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లో తయారయ్యే ప్రొడక్ట్‌‌లతో  ఓఎన్‌‌డీసీ ద్వారా భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి వీలుంటుంది.  కానీ, చిన్న బిజినెస్‌‌లు తమ కంటూ బ్రాండ్‌‌ను  క్రియేట్ చేసుకోవడం మాత్రం అంత ఈజీ కాదనే చెప్పాలి.

మరిన్ని సిటీలకు ఓఎన్‌డీసీ.. 

ఓఎన్‌డీసీని మరిన్ని సిటీలకు విస్తరిస్తామని  కామర్స్ మినిస్టర్ పీయుష్ గోయల్ అన్నారు.  ప్రస్తుతం ఐదు సిటీలలో ఈ నెట్‌వర్క్ పైలెట్ ప్రాజెక్ట్‌ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోందని పేర్కొన్నారు. ‘బిటా టెస్టింగ్‌లో భాగంగా ఓఎన్‌డీసీని నెమ్మదిగా విస్తరిస్తున్నాం. ఇతర సిటీలకు కూడా విస్తరించడం ద్వారా ఈ నెట్‌వర్క్ ఎంత సమర్ధవంతంగా పనిచేస్తుందనేది తెలుసుకుంటాం.  ఓఎన్‌డీసీని మరిన్నీ సిటీలకు విస్తరిస్తే  డేటా స్టోరేజ్ అవసరం పెరుగుతుంది. మొత్తం ప్రాసెస్‌ను మేనేజ్‌ చేయడం కూడా ఎక్కువవుతుంది’ అని పేర్కొన్నారు. ఆన్‌లైన్ బిజినెస్‌లో డెమోక్రసీని ఓఎన్‌డీసీ తీసుకొస్తుందని గోయల్ 
అభిప్రాయపడ్డారు.