అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో పెరిగిన పెట్రోల్ వాడకం.. డీజిల్ వినియోగంలో స్వల్ప తగ్గుదల

అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో పెరిగిన పెట్రోల్ వాడకం.. డీజిల్ వినియోగంలో స్వల్ప తగ్గుదల

న్యూఢిల్లీ:  పండుగల కారణంగా అక్టోబర్‌‌‌‌లో ప్రయాణాలు పెరగడంతో భారత్‌‌‌‌లో పెట్రోల్ అమ్మకాలు ఐదు నెలల గరిష్ట స్థాయికి చేరాయి. అయితే డీజిల్ వినియోగం మాత్రం స్వల్పంగా తగ్గింది.  పెట్రోల్ వినియోగం కిందటేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో 7శాతం పెరిగి 36.5 లక్షల టన్నులకు చేరింది. సెప్టెంబర్‌‌‌‌లో ఇది 34 లక్షల టన్నులుగా ఉంది. డీజిల్ వినియోగం  కిందటేడాది అక్టోబర్‌‌‌‌లో 76.4 లక్షల టన్నులు ఉండగా, ఈ అక్టోబర్‌‌‌‌లో 76 లక్షల టన్నులకు తగ్గింది. సాధారణంగా జూన్‌‌‌‌లో వర్షాకాలం ప్రారంభమయ్యే సమయంలో డీజిల్ వినియోగం తగ్గుతుంది.  

అక్టోబర్‌‌‌‌ నుంచి  తిరిగి సేల్స్ పెరుగుతాయి. కానీ,   ఈసారి మాత్రం అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో వినియోగం తగ్గింది.  జెట్ ఇంధనం (ఏటీఎఫ్‌‌‌‌) వినియోగం ఏడాది లెక్కన  1.6శాతం పెరిగి 7.69 లక్షల టన్నులకు,  ఎల్‌‌‌‌పీజీ అమ్మకాలు ఏడాది లెక్కన   5.4శాతం పెరిగి అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో 30 లక్షల టన్నులకు చేరాయి. వంట గ్యాస్ డిమాండ్‌‌ పెరగడంతో ఎల్‌‌పీజీ సేల్స్ ఊపందుకున్నాయి. పీఎంయూవై స్కీమ్‌‌‌‌ ద్వారా అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో 25 లక్షల కొత్త ఇళ్లకు ఎల్‌‌‌‌పీజీ కనెక్షన్లు ఇవ్వడంతో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 10.33 కోట్ల నుంచి 10.58 కోట్లకు పెరిగింది. 

2025–26 ఆర్థిక సంవత్సరం మొదటి 7 నెలల్లో పెట్రోల్ వినియోగం ఏడాది లెక్కన 6.8శాతం పెరిగి 2.48 కోట్ల టన్నులకు, డీజిల్ వినియోగం 2.45శాతం పెరిగి 5.33  కోట్ల టన్నులకు, ఏటీఎఫ్ వినియోగం ఒక శాతం పెరిగి 52 లక్షల టన్నులకు, ఎల్‌‌‌‌పీజీ వాడకం 7.2శాతం పెరిగి 1.97 కోట్ల టన్నులకు చేరాయి.