చాలా ఏళ్ల తర్వాత తన వ్యాపారాలను తిరిగి లాభాల్లోకి తీసుకొస్తున్న అనిల్ అంబానీ దర్యాప్తు సంస్థల రాడార్ లో చిక్కుకున్నారు. ఇన్నాళ్ల తర్వాత కావాలనే ఆయనను ఇబ్బంది పెట్టేందుకు కేసు దర్యాప్తు వేగవంతం చేశారా అనే ప్రశ్నలు ఉన్నప్పటికీ.. ఈడీ దూకుడు పెంచటంతో దుర్వినియోగానికి గురైన రుణాల రూపంలో పొందిన ప్రజాధనం వెనక్కి రాబట్టే ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే దర్యాప్తు సంస్థ ఈడీ తాజాగా రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ కి చెందిన దాదాపు రూ.3వేల 84 కోట్లు విలువైన ఆస్తులను జప్తు చేసింది. మనీలాండరింగ్ చట్టాల కింద తీసుకున్న తాజా చర్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో ముంబైలోని బాంద్రా పాలీహిల్ బంగ్లా, ఢిల్లీలోని రిలయన్స్ సెంటర్ కూడా ఉన్నాయి. వీటికి తోడు దేశంలోని నోయిడా, ఘడియాబాద్, ముంబై, పూణే, థానే, హైదరాబాద్, చెన్నైతో పాటు ఏపీలోని ఈస్ట్ గోదావరిలోని అంబానీకి చెంది భూములు కూడా ఉన్నాయని వెల్లడైంది.
ప్రధానంగా ఈ కేసులో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి. ఇవి గతంలో యెస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.2వేల 965 కోట్ల రుణాలు నిరర్థక ఆస్తులుగా మారటం వెనుక నిధుల మళ్లింపు, రుణ మంజూరులో అక్రమాలు జరిగినట్లు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గుర్తించిన సంగతి తెలిసిందే. కొంత మెుత్తాన్ని రిలయన్స్ నిప్పాన్ మ్యూచువల్ ఫండ్ ద్వారా ప్రత్యక్ష పెట్టుబడి పెట్టడం సెబీ నిబంధనలకు విరుద్ధమని ED దర్యాప్తులో తేలింది. అందువల్ల మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టిన ప్రజా డబ్బును యెస్ బ్యాంక్ ద్వారా మళ్లించి.. ఆపై అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు బదిలీ చేసినట్లు వెల్లడైంది.
అనిల్ అంబానీ ఆస్తుల స్వాధీనంలో.. అతని రుణ ఫైళ్లు అసంపూర్తిగా ఉన్నాయని ఈడీ అధికారులు గుర్తించారు. అలాగే అనేక పత్రాలు ఖాళీగా ఉన్నాయని, మరికొన్ని ఓవర్‌రైట్ చేయబడ్డాయని, భద్రతా రిజిస్టర్లు నిర్వహించబడలేదని, రికార్డులు లేవని గుర్తించారు. అలాగే కేవలం కాగితాలకు పరిమితమైన బూటకపు కంపెనీలను కూడా ఈడీ అధికారులు గుర్తించారు. రుణాలను దుర్వినియోగం చేసేందుకే కావాలని రికార్డులను సరిగ్గా మెయిన్టైన్ చేయలేదని ఈడీ అధికారులు పేర్కొన్నారు. మెుత్తానికి ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో రూ.12వేల 600 కోట్లు అనుబంధ సంస్థలకు బదిలీ కాగా రూ.18వందల కోట్ల డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులుగా బదిలీ జరిగినట్లు తేలింది. అలాగే బిల్స్ డిస్కౌంటింగ్ సౌకర్యాన్ని కూడా కంపెనీ దుర్వినియోగం చేసిందని ఈడీ పేర్కొంది.
