- గిట్టుబాటు ధర లేక చేనులోనే పంట వదిలేస్తున్న రైతులు
వనపర్తి, వెలుగు: ఉల్లి పండించిన రైతులు నష్టాల ఊబిలో చిక్కుకున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో కోత దశలోనే చేతికొచ్చిన పంటను పశువుల మేతకు వదిలేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కువగా ఉల్లి పంటను వనపర్తి జిల్లాలోనే పండిస్తారు. ఈ ఏడాది జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఈ సీజన్లో 3 వేల ఎకరాల్లో ఉల్లి సాగైంది. జిల్లాలో 90 శాతం ఉల్లి పంట చిన్నంబావి మండలంలో సాగవుతుండగా, పెబ్బేరు, వీపనగండ్ల మండలాల్లోని కొన్ని గ్రామాల్లోనూ ఉల్లి సాగు చేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో 500 ఎకరాలకు మించి సాగు కావడం లేదు.
వర్షాలకు దెబ్బతిన్న పంట..
జిల్లాలో ఖరీఫ్ సీజన్లోనే ఉల్లి సాగు చేస్తారు. విత్తనాలను ఏపీలోని నందికొట్కూరు ప్రాంతంలోని ఉల్లి పండించే రైతుల నుంచి కొనుగోలు చేస్తారు. నాసిక్ రెడ్, డార్క్ రెడ్ రకాల విత్తనాలు తీసుకొస్తారు. ఉల్లి పంట కాలపరిమితి 120 రోజులు కాగా, విత్తనాలను నారు మడి లేదంటే వెదజల్లే పద్ధతిలో వేస్తారు. దీంతో కూలీల ఖర్చు తగ్గుతుంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో ఈ ఏడాది పంట దెబ్బతింది. గడ్డలు ఊరే దశలో వర్షాలు కురవడంతో ఎక్కువ శాతం పంట దెబ్బతిన్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా దిగుబడిపై ప్రభావం చూపింది. వాతావరణం అనుకూలిస్తే ఎకరానికి 10 టన్నుల దిగుబడి వస్తుంది. కానీ, వర్షాల కారణంగా ఆరేడు టన్నులకు మించి రాలేదని రైతులు వాపోతున్నారు.
పొలం మీదే పంట వదిలేస్తున్రు..
ఉల్లిగడ్డలకు గిట్టుబాటు ధర లేకపోవడం, కొనడానికి వ్యాపారులు ఎవరూ రాకపోవడంతో ఉల్లి రైతులు పండించిన, కోతకొచ్చిన పంటను పొలంలోనే వదిలేస్తున్నారు. గొర్రెలు, మేకలు తదితర పశువులకు మేతగా మారుతోంది. ఊళ్లలో తిరిగి రూ.వందకు అయిదారు కిలోల చొప్పున అమ్మినా వెహికల్ ఖర్చులు కూడా మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం వద్దకు ఉల్లిగడ్డల కోసం ఎవరైనా వస్తే వంద కిలోల ఉల్లి బస్తాను రూ.200 లేదంటే అంతకన్నా తక్కువకే అమ్ముతున్నారు. ధర లేదనే కారణంతో పంటను దున్నేద్దామన్నా ట్రాక్టర్ కిరాయి తడిసి మోపెడవుతోందని వాపోతున్నారు.
పొలం మీదనే వదిలేశా...
మార్కెట్లో కిలో ఉల్లి రూ.50-నుంచి రూ.60 వరకు పలుకుతుండగా పంట గిట్టుబాటవుతుందని ఆరు ఎకరాల్లో ఉల్లి పంట వేసిన. పంట చేతికొచ్చే టైంకు మార్కెట్ లో ఉల్లి రేటు బాగా తగ్గిపోయింది. రూపాయికి కిలో ఇస్తామన్నా.. కొనేవారు లేకుండా పోయారు. ఉన్న పంటను పొలం మీదనే పశువులకు వదిలేసిన. ఏపీలో మాదిరిగా ఇక్కడ కూడా ప్రభుత్వం ఉల్లి రైతులను ఆదుకోవాలి. -చంద్రశేఖర్‌యాదవ్, లక్ష్మిపల్లి, చిన్నంబావి
మార్కెట్ఫ్లక్చుయేషన్తో ఇబ్బంది..
ఈసారి మార్కెట్లో ఉల్లి ధర బాగా తగ్గిపోయింది. మార్కెట్ ఫ్లక్చుయేషన్ అంచనా వేయడం కష్టం. ఈ ఏడాది కురిసిన వర్షాలు కూడా ఉల్లి రైతులను దెబ్బతీశాయి. రేటు కూడా పడిపోవడంతో ఉల్లి రైతులు నష్టాల బారినపడ్డారు.-కృష్ణ, హార్టికల్చర్ ఆఫీసర్
