
97వ ఆస్కార్ 2025 అవార్డులలో అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్‌గా ‘సంతోష్’ ఎంపికైన విషయం తెలిసిందే. UKకు చెందిన ఈ మూవీని సంధ్యా సూరి తెరకెక్కించారు. ఆస్కార్కి షార్ట్ లిస్ట్ అయినప్పటికీ, చివరకు విజయాన్ని అందుకోలేకపోయింది. అలాగే, ఈ మూవీ 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమై ప్రశంసలు అందుకుంది.
ఈ చిత్రంలో భారతీయ నటీనటులు షహానా గోస్వామి మరియు సునీతా రాజ్‌వర్ ప్రధాన పాత్రలు పోషించారు. షహానా గోస్వామి ఇందులో సంతోష్‌గా నటించింది. అయితే, 'సంతోష్' సినిమాను ఇండియా థియేటర్లలో రిలీజ్ చేయడానికి సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇందులో పోలీసుల క్రూరత్వాన్ని చూపించడంతో పాటు, కుల వివక్ష, లైంగిక వేధింపులు వంటి అంశాలను కళ్ళకు కట్టినట్లుగా చూపించారు డైరెక్టర్ సంధ్యా సూరి.
ఈ క్రమంలో CBFC అధికారులు.. సినిమాలో ఎక్కువ కట్స్ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కొన్ని పాత్రల పేర్లు మార్చాలని, పలు సన్నివేశాలను తొలగించాలని సూచించారు. అయితే వీటికి మేకర్స్ అంగీకరించకపోవడంతో సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయడానికి బోర్టు నిరాకరించింది.
‘సంతోష్’ ఓటీటీ:
‘సంతోష్’ (Santosh) మూవీ 2024 మే 20న విడుదలైంది. ఇప్పుడు ఈ మూవీ ఎట్టకేలకు ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చింది. అక్టోబర్ 17 నుంచి లయన్స్‌గేట్ ప్లేలో అందుబాటులో ఉంది. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన ఒక మహిళ కథగా ఈ సినిమాను రూపొందించారు. భర్త మరణం తర్వాత ఆమె పోలీస్‌గా మారడం.. ఒక యువతి హత్య కేసు ఛేదించే సమయంలో తనకు ఎదురైన సవాళ్లు ఏమిటి? అన్న కోణంలో దీనిని సిద్ధం చేశారు. అందువల్ల సినిమా థియేటర్లలో రిలీజ్కు నోచుకోలేదు. వీకెండ్ టైం దొరికింది కాబట్టి, తప్పకుండా మూవీ చూసేయండి.
కథేంటంటే:
సంతోష్ సైని (షహానా గోస్వామి) భర్త కానిస్టేబుల్‌గా పని చేసేవాడు. ఒకసారి డ్యూటీలో ఉండగా అల్లర్లలో చనిపోతాడు. దాంతో ఆ ఉద్యోగం సంతోష్‌కి వస్తుంది. కుటుంబాన్ని పోషించుకోవడానికి తప్పని పరిస్థితిలో ఆమె ఉద్యోగంలో చేరుతుంది. తన తల్లిదండ్రులు, అత్తమామల సపోర్ట్ తీసుకోకుండా వాళ్లకు దూరంగా, స్వతంత్రంగా బతకాలి అనుకుంటుంది.
ఉద్యోగంలో చేరాక ఎప్పుడు మౌనంగా ఉండాలో, ఎప్పుడు అబద్ధం చెప్పాలో అన్నీ ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ ఉంటుంది. అదే టైంలో దేవిక అనే యువతి హత్య కేసు దర్యాప్తు చేయడానికి తన పై ఆఫీసర్ గీత (సునీతా రాజ్వర్)తో కలిసి వెళ్తుంది. ఆ హత్య సంతోష్ జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది? అనేదే మిగతా కథ.