నాణ్యత లేకే కూలుతున్నయ్!..మానేరుపై నాసిరకం పనులు, డిజైన్ లోపాలతో కొట్టుకపోతున్న చెక్డ్యామ్లు

నాణ్యత లేకే కూలుతున్నయ్!..మానేరుపై నాసిరకం పనులు, డిజైన్ లోపాలతో కొట్టుకపోతున్న చెక్డ్యామ్లు
  • బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రూ.350 కోట్లతో 29 చెక్​డ్యామ్​ల నిర్మాణం
  • ఇందులో సగానికి పైగా కొట్టుకపోయినయ్​
  • ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
  • తనుగుల చెక్ డ్యాం ఘటనతో గతంలో నిర్మించిన చెక్ డ్యామ్ ల నాణ్యతపై మరోసారి చర్చ

కరీంనగర్/పెద్దపల్లి, వెలుగు: ఉమ్మడి జిల్లాలో మానేరు నదిపై గత బీఆర్ఎస్  సర్కార్  హయాంలో చేపట్టిన చెక్ డ్యామ్ లపై ఓ వైపు విజిలెన్స్  విచారణ జరుగుతుండగానే.. జమ్మికుంట మండలం తనుగుల వద్ద చెక్ డ్యామ్  కూలిపోవడం చర్చనీయాంశంగా మారింది. 

చెక్ డ్యామ్ ల నిర్మాణంలో నాణ్యత, డిజైన్ లోపాలు మరోసారి తెరపైకి వచ్చాయి. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో మానేరుపై బీఆర్ఎస్  సర్కార్  హయాంలో సుమారు రూ.500 కోట్లతో 29 చెక్​డ్యామ్​లు నిర్మించగా.. ఇందులో కొన్ని నిర్మించిన కొన్నాళ్లకే కొట్టుకుపోగా, మిగిలినవి నిర్మాణంలో ఉండగానే వరద ధాటికి ధ్వంసమయ్యాయి. 

దీంతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయింది. అయితే డిజైనింగ్  లోపం, నాసిరకం పనుల వల్లే చెక్ డ్యామ్ లు కొట్టుకుపోయాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఇటీవల కూలిన తనుగుల చెక్ డ్యాంను ఇసుక మాఫియానే కూల్చిందని బీఆర్ఎస్  నేతలు ఆరోపిస్తుండగా.. గతంలో బీఆర్ఎస్  సర్కార్  హయాంలో వరదకు కొట్టుకుపోయిన చెక్ డ్యామ్ ల మాటేమిటని కాంగ్రెస్, బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. 

ఉమ్మడి జిల్లాలో 12 చెక్ డ్యామ్ లు వరదపాలు..  

బీఆర్ఎస్  సర్కార్  హయాంలో 2019–2023 మధ్య కాలంలో నాబార్డు రుణ సాయంతో దశలవారీగా చెక్ డ్యాంల నిర్మాణాలు చేపట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 114 చెక్ డ్యామ్ ల నిర్మాణానికి ప్రపోజల్స్  సిద్ధం చేశారు. వీటిలో మానేరు నదిపై 57 చెక్ డ్యామ్ లకు అప్పటి ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా.. ఇందులో 29 చెక్ డ్యామ్ ల నిర్మాణం పూర్తయింది.

 ఇందులో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి, నీరుకుల్ల, గట్టెపల్లి, కదంబాపూర్, తొగర్రాయి, ఓదెల మండలం కనగర్తి, మడక, పొత్కపల్లి, ఇందుర్తి, రూప్  నారాయణపేట, గుంపుల(తనుగుల), కాల్వ శ్రీరాంపూర్-–మొట్లపల్లి గ్రామాల మధ్య, మీర్జంపేట, కిష్టంపేట, ముత్తారం మండలం ఓడేడ్, ఖమ్మంపల్లి మధ్య, అడవి శ్రీరాంపూర్, మంథని మండలం అడవిసోమన్ పల్లి –చిన్న ఓదెల మధ్య,  గోపాలపూర్  చెక్ డ్యాంలు ఉన్నాయి. 

వీటిలో కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట, మంగపేట సమీపంలో నిర్మించిన చెక్ డ్యాంలు వరదలకు కొట్టుకుపోయాయి. ఓదెల మండలం మడక వద్ద నిర్మించిన చెక్ డ్యాంతో పాటు కనగర్తి చెక్ డ్యాం కొంతభాగం కొట్టుకుపోయింది. సుల్తానాబాద్  మండం నీరుకుళ్ల చెక్ డ్యాం బెడ్ తో పాటు ఆఫ్రాన్  కూడా కొట్టుకుపోయింది.

 కరీంనగర్  జిల్లాలో బొమ్మకల్, గోపాలపూర్, ముగ్ధుంపూర్, ఇరుకుల్ల, మందులపల్లి వద్ద చెక్ డ్యామ్ లు నిర్మించారు. ఒక్కో చెక్ డ్యామ్  నిర్మాణానికి రూ.18 కోట్ల చొప్పున కేటాయించారు. వర్షాలు కురిసినప్పుడు లోయర్  మానేరు డ్యామ్  నుంచి 1.70 లక్షల క్యూసెక్కుల వరదను మాత్రమే తట్టుకునేలా బొమ్మకల్  చెక్ డ్యామ్  నిర్మించారు. 2021 సెప్టెంబర్ లో వచ్చిన వర్షానికి సుమారు 2.30 లక్షల క్యూసెక్కుల నీళ్లు ఒక్కసారిగా వదలడంతో ఈ చెక్ డ్యామ్  ముక్కలైంది. 

అదే ఏడాది మరోసారి కురిసిన భారీ వర్షానికి గోపాలపూర్, ముగ్ధుంపూర్, ఇరుకుల్ల, మందులపల్లి చెక్ డ్యామ్ లు కూడా కొట్టుకుపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం శివారులో నెహ్రూ నగర్  వద్ద మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్  కొన్ని రోజులకే కొట్టుకుపోయింది. కాంట్రాక్టర్  క్వాలిటీ పాటించకపోవడంతో మొదటిసారి వచ్చిన వరదకే ధ్వంసమైంది. ఇల్లంతకుంట మండలం కస్బెకట్కూరు వద్ద నిర్మించిన చెక్ డ్యామ్  కూడా కొట్టుకుపోయింది.

సరైన ప్రణాళిక లేకనే..

డిజైన్లలో లోపాలు, నాసిరకం నిర్మాణం, ఇంజనీరింగ్  ఆఫీసర్ల పర్యవేక్షణ లోపంతోనే చెక్ డ్యాంలు ముక్కలు చెక్కలయ్యాయనే ఆరోపణలున్నాయి. మానేరు నది వెడల్పు సుమారు కిలోమీటర్ పైనే ఉంటుంది. అంత వెడల్పులో వాటర్  ఫ్లోటింగ్ కు అడ్డుకట్ట వేసి నీటిని నిల్వ చేయాలంటే సరైన ప్రణాళిక అవసరం. కానీ, సరైన ప్లానింగ్  లేకుండానే పనులు మొదలుపెట్టారు. 

వాగుపై నిర్మించే ఆఫ్రాన్లకు సపోర్టుగా బెడ్  నిర్మాణాన్ని ఇసుక మీదే నిర్మించడంతో వరద తీవ్రతకు చెక్ డ్యామ్ లన్నీ కొట్టుకుపోయాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే చెక్ డ్యాంల నిర్మాణాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చెక్ డ్యామ్  నిర్మాణాల్లో డిజైన్, నాణ్యత లోపాలను గుర్తించిన విజిలెన్స్  ఆఫీసర్లు త్వరలోనే సర్కార్ కు రిపోర్ట్​ ఇవ్వనున్నట్లు తెలిసింది.