వానకాలంలోనూ వరి పంట వైపే? 5.16 లక్షల ఎకరాల్లో పంటల సాగు అంచనా

వానకాలంలోనూ వరి పంట వైపే?  5.16 లక్షల ఎకరాల్లో పంటల సాగు అంచనా

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లావ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్​లో అధిక విస్తీర్ణంలో వరి పంట సాగయ్యే అవకాశం ఉంది. జిల్లాలో 5.40 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా, 5.16 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 2,95,310 ఎకరాల్లో వరి, 91,302 ఎకరాల్లో సోయా, మక్క 75,030 ఎకరాలు, పత్తి 31,335 ఎకరాలు, కంది 9,112 ఎకరాలు, పెసర 5,287 ఎకరాలు, మినుము 2,815 ఎకరాలు, చెరకు 4,432 ఎకరాలు, 1,882 ఎకరాల్లో ఇతర పంటలు పండించనున్నట్లు అధికారులు తెలిపారు. నిరుడు వానాకాలం 2.90 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా,ఈ సారి మరో 5 వేల ఎకరాల్లో అదనంగా సాగుచేయనున్నారు.

పంట మార్పిడి లేక..

చాలా ఏరియాల్లో వానాకాలం, యాసంగి సీజన్లలో కంటిన్యూగా వరి పండిస్తున్నారు. పంట మార్పిడి చేయకుండా ఏళ్ల తరబడి ఒకే పంటను పండిస్తుండడంతో నేలలో పోషకాలు తగ్గి, తెగుళ్ల ప్రభావం ఎక్కువవుతోంది. ఇది దిగుబడిపై ప్రభావం చూపుతోంది. యాసంగిలో వరికి ఎక్కువగా తెగుళ్లు సోకాయి. నాట్లు వేసిన నేల రోజుల్లోపే అగ్గి తెగులు వ్యాపించి, పంట ఎదగలేదు. ఎకరానికి రూ.2వేలకు పైగా ఖర్చు చేసి మందులు స్రై చేయాల్సి వచ్చింది. దీని ప్రభావం వల్ల పంట దిగుబడి తగ్గింది. ఎకరాకు 25 క్వింటాళ్లు పంట పండాల్సి ఉండగా, 18 నుంచి 20 క్వింటాళ్లు వచ్చింది. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు సరైన సూచనలు చేయడం లేదు. మరోవైపు ఈ వానాకాలం సీజన్​లో వరి పంటను ముందస్తుగా సాగు చేసే విషయంపై వ్యవసాయశాఖ దృష్టి సారించింది. 

అవగాహన కల్పిస్తున్నాం..

సాగు నీటి ప్రాజెక్టులు, చెరువులు, కుంటల కింద రైతులు ఎక్కువగా వరి పంట సాగు చేస్తున్నారు. పంట మార్పిడి చేయాలని రైతులకు చెబుతున్నాం. పత్తి,  కంది పంట ఎక్కువగా సాగు చేయాలని సూచనలిస్తున్నాం.ఈ సీజన్ ​నుంచి రైతులు నెలరోజుల ముందే వరి నాట్లు వేసేలా చర్యలు తీసుకుంటున్నాం. అప్పుడే అకాల వర్షాల నుంచి పంటను కాపాడుకునే వీలుంటుంది.
వీరాస్వామి, 
జిల్లా అగ్రికల్చర్​ ఆఫీసర్,​ కామారెడ్డి