నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి

నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి
  • గవర్నర్ ఆమోదం కోసం కేబినెట్ సిఫారసు

హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డిని ఎంపిక చేస్తూ కేబినెట్ సమావేశం ఏకగ్రీవంగా ఖరారు చేసింది. ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదిస్తూ గవర్నర్ కు సిఫారసు చేసింది. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన పాడి కౌశిక్ రెడ్డి కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. 
కాంగ్రెస్ లో ఉంటూనే టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్నట్లు ఆయన కార్యకర్తలతో మాట్లాడిన ఆడియో రికార్డింగులు వెలుగులోకి రావడంతో ఆయనే హుజూరాబాద్ అభ్యర్థి అన్న ప్రచారం జోరుగా సాగింది. వరుసగా రెండు ఆడియోలు బయటపడిన నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పందించి చర్యలకు ఉపక్రమించగా ఆయనే పార్టీకి గుడ్ బై చెప్పి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఆయన హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తారా.. ? లేదా.. ? అన్న చర్చ కొనసాగుతున్న తరుణంలో ఆయనను ఎమ్మెల్సీగా పంపడం ప్రాధాన్యత సంతరించుకుంది. హుజూరాబాద్ తరపున బరిలోకి దిగబోయే అభ్యర్థి ఎవరన్న చర్చలకు మళ్లీ అవకాశం కల్పించింది. ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తుండగా.. కేసీఆర్ మదిలో ఎవరున్నారన్నది ఉత్కంఠ రేపుతోంది.