
- ఏజెన్సీ మండలాల అభివృద్ధికి చర్యలు
మహబూబాబాద్/ కొత్తగూడ, వెలుగు: బీఆర్ఎస్ నేతలు ఓట్ల కోసం డ్రామాలు ఆడుతున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి మండిపడ్డారు. శుక్రవారం ఆమె మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ, గంగారం మండలాల్లో పర్యటించారు. ముందుగా గుంజేడు ముసలమ్మ ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రైతు వేదికలో రేషన్ కార్డులు పంపిణీ చేసి, వన మహోత్సవంలో భాగంగా ఎంపీడీవో ఆఫీస్ మొక్కలు నాటారు. కొత్తగూడలో హెల్త్ సబ్ సెంటర్, మొండ్రాయి గూడెం అంగన్వాడీ బిల్డింగ్, ఓటాయి క్రాస్ రోడ్డు సమీపంలో కొత్తగా రూ.3 కోట్లతో నిర్మించిన బ్రిడ్జి, ఓటాయిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. కొత్తగూడ, సాదిరెడ్డిపల్లిలో ఇటీవల మృతిచెందిన బాధిత కుటుంబాలను పరామర్శించారు.
గంగారం మండలం బర్ల మల్లయ్య గుంపు గ్రామానికి చెందిన ఈక అభి (5) 1వ తరగతి విద్యార్థికి గుండె సమస్య ఉండటంతో మెరుగైన వైద్యం అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత సీజన్లో యూరియా వాడకం అధికంగా ఉన్నప్పటికీ కొరత లేకుండా చూస్తున్నట్లు తెలిపారు. ఇటీవల కొత్తగూడ మండలంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కావాలని రైతులను రెచ్చగొట్టి వారి కార్యకర్తలతో యూరియా కొరత ఉన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు.
ప్రతిరోజు గంగారం, కొత్తగూడెం మండలాలకు రెండు లారీల యూరియా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఏజెన్సీ మండలాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించామని తెలిపారు. కార్యక్రమాల్లో ఏటూరునాగారం ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా, ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చల్ల నారాయణరెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వజ్జ సారయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుందరపోయిన మొగిలి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.