
- హెల్త్ సెక్రటరీని కోరిన పారామెడికల్ జాయింట్ యాక్షన్ కమిటీ
హైదరాబాద్, వెలుగు: పారామెడికల్ ఉద్యోగులకు వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని పారామెడికల్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ప్రభుత్వాన్ని కోరింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలో పారామెడికల్ ఉద్యోగుల ప్రమోషన్లు ఆలస్యం కావడంపై జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం ఈ విషయంపై ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి డైటీషియన్, బయోకెమిస్ట్, లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్ వంటి పోస్టులకు ప్రమోషన్లు ఇవ్వడం లేదని జేఏసీ ఆరోపించింది.
ప్రతి సంవత్సరం ప్రమోషన్ల కోసం లిస్ట్ తయారు చేసి, చివరి నిమిషంలో ఆలస్యం చేస్తున్నారని విమర్శించింది. డీఎంఈలో ప్రొఫెసర్లు, ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందికి మాత్రం వేగంగా ప్రమోషన్లు ఇస్తున్నారని జేఏసీ పేర్కొంది. డైటీషియన్ ప్రమోషన్ల ఆలస్యం వెనుక డీఎంఈ అధికారులు, డైట్ కాంట్రాక్టర్ల పాత్ర ఉందని జేఏసీ నేత నిజాముద్దీన్ ఆరోపించారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని, ప్యానెల్ ఇయర్ ముగియకముందే వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తూను కోరారు.