ఎగ్జామ్స్​ పెట్టిన్రు.. రిజల్ట్స్​మరిచిన్రు

ఎగ్జామ్స్​ పెట్టిన్రు.. రిజల్ట్స్​మరిచిన్రు
  •  ఫలితాల కోసం ఎదురు చూస్తున్న   పారా మెడికల్​ స్టూడెంట్స్​
  •  7 నెలలవుతున్నా పట్టించుకోని ఆఫీసర్లు   సర్టిఫికెట్​ లేక నష్టపోతున్న స్టూడెంట్లు 

ఎగ్జామ్స్​ రాసి ఏడు నెలలు దాటింది. కానీ ఇంతవరకు రిజల్ట్స్​ ఇవ్వకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉపాధి కోసం ఎక్కడికి వెళ్లాలన్నా సర్టిఫికెట్​ తప్పనిసరిగా అడుగుతున్నరు. దీంతో జాబ్​ ఆపర్చునిటీస్​మిస్​ అవుతున్నాం. దీనిపై ఆఫీసర్లు దృష్టి పెట్టి రిజల్ట్స్​ విడుదల చేస్తే బాగుంటుంది.  - జిట్టె రాకేశ్, వరంగల్​

వరంగల్, వెలుగు: తెలంగాణ స్టేట్​ పారా మెడికల్​బోర్డు(టీఎస్ పీఎంబీ) నిర్లక్ష్యం స్టూడెంట్ల పాలిట శాపంగా మారింది. ఎగ్జామ్స్ నిర్వహించి నెలలు గడుస్తున్నా ఫలితాలు ప్రకటించడంలో బోర్డు జాప్యం చేస్తోంది. ఇప్పటికే కరోనా వల్ల అకడమిక్​ ఇయర్​లేట్​కాగా.. రాసిన పరీక్షలకు రిజల్ట్​ ఇవ్వడంలోనూ ఆఫీసర్లు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. రిజల్ట్స్​కోసం హైదరాబాద్​లోని బోర్డు ఆఫీస్​కు కాల్ ​చేస్తే ఎవరూ రెస్పాండ్​ కావడం లేదని స్టూడెంట్లు వాపోతున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పారా మెడికల్​ పోస్టులను భర్తీ చేస్తుండగా సర్టిఫికెట్లు లేని కారణంగా వీరంతా ఆయా ఖాళీలకు అనర్హులవుతున్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక ఇబ్బందులు ఎదురవుతుంటే.. వచ్చిన చిన్నచిన్న అవకాశాలు కూడా ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్ల చేజారుతున్నాయని చాలామంది స్టూడెంట్లు మనోవేదనకు గురవుతున్నారు.
15 వేల మంది స్టూడెంట్స్​
టీఎస్​పీఎంబీ కింద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 160 కాలేజీలున్నాయి. అందులో డీఎంఎల్ టీ, డీఎంఐటీ, ఆప్తాల్మిక్​అసిస్టెంట్, డయాలసిస్, రెస్పిరేటరీ థెరపీ, ఈసీజీ, అనస్థీషియా, ఆడియోమెట్రీ టెక్నీషియన్స్, మల్టీపర్పస్​ హెల్త్​అసిస్టెంట్ ఇలా మొత్తం 18 గ్రూపుల్లో దాదాపు 15 వేల మంది స్టూడెంట్స్​ఉన్నారు. 2018–-20 బ్యాచ్​కు చెందిన స్టూడెంట్లకు గత ఏడాది మేలో ఎగ్జామ్స్​ నిర్వహించాల్సి ఉంది. కానీ ఆ సమయంలో కరోనా తీవ్రంగా ఉందని పోస్ట్ పోన్​ చేశారు. తర్వాత 2020 డిసెంబర్​లో థియరీ, 2021 జనవరిలో ప్రాక్టికల్​ ఎగ్జామ్స్​ కండక్ట్​ చేశారు. ఈ ఏడాది మే నెలలో రిజల్ట్స్​ ప్రకటించాల్సి ఉండగా సంబంధిత ఆఫీసర్లు దానిపై దృష్టి పెట్టడం లేదు. ఇప్పటికే అకడమిక్​ ఇయర్ ​వేస్ట్​ కాగా.. స్టూడెంట్లు ఫలితాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే 2018–-20 బ్యాచ్​కు రిజల్ట్స్​ ప్రకటించిన తరువాత 2019–-21 బ్యాచ్​ స్టూడెంట్స్​కు ఎగ్జామ్​ షెడ్యూల్​ రిలీజ్​ చేయాల్సి ఉంది. కానీ అటు ముందు బ్యాచ్​కు రిజల్ట్స్​ ఇవ్వకపోగా.. ప్రస్తుతం ఉన్న బ్యాచ్​కు ఎగ్జామ్స్​ కండక్ట్​ చేయడంపైనా ఆఫీసర్లు శ్రద్ధ పెట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
అర్హత లేక ఆగిపోతున్నరు
ఇటీవల రాష్ట్రంలోని 19 జిల్లాల్లో కొత్తగా డయాగ్నోస్టిక్ సెంటర్లు ప్రారంభించారు. వాటితో పాటు జిల్లాల్లో ఖాళీగా ఉన్న ఎంఎల్​టీ, ఎంపీహెచ్​డబ్ల్యూ తదితర టెక్నీషియన్​ పోస్టులను ఔట్​సోర్సింగ్​ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. కానీ పారా మెడికల్​ కోర్సు కంప్లీట్​చేసినట్లుగా వీరి దగ్గర ఎలాంటి సర్టిఫికెట్స్ ​లేకపోవడంతో ఆయా జాబ్​లకు అప్లై చేసుకోలేకపోతున్నారు. అంతేగాకుండా ఫలితాలు ప్రకటించిన అనంతరం మెమోల ఆధారంగా పారా మెడికల్​ బోర్డులో స్టూడెంట్లు రిజిస్ట్రేషన్​ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా రిజిస్టర్​ అయిన సర్టిఫికెట్​ఉంటేనే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ రిజల్ట్స్ రాకపోవడంతో స్టూడెంట్స్ ​రిజిస్ట్రేషన్​ చేయించుకోలేకపోతున్నారు. దీంతో ఎక్కడికెళ్లినా జాబ్​లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా వచ్చిన అవకాశాలు చేజారుతున్నాయని వాపోతున్నారు. ఫలితాల కోసం హైదరాబాద్​లోని బోర్డు ఆఫీస్​కు కాల్​ చేస్తే అక్కడి సిబ్బంది సరిగా రెస్పాండ్​ అవడం లేదు. ఒకవేళ రెస్పాండ్​ అయినా వారం, పది రోజులు అంటూ కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితాలు తొందరగా ప్రకటిస్తే ఎంతో కొంత మేలు జరుగుతుందని, ఈ మేరకు ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని పారా మెడికల్​ స్టూడెంట్స్​విజ్ఞప్తి చేస్తున్నారు.

వెంటనే ప్రకటించాలి
ఇప్పటికే అకడమిక్​ఇయర్​చాలా లేట్​ అయ్యింది. పరీక్షలు ఆలస్యంగా పెట్టారు. రిజల్ట్స్​ విడుదల చేయడంపైనా ఆఫీసర్లు దృష్టి పెట్టడం లేదు. ఫలితాలు తొందరగా ఇస్తే ఎక్కడైనా జాబ్​ కోసం ట్రై చేసే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి వెంటనే రిజల్ట్స్​ ప్రకటిస్తే ఎంతోమంది స్టూడెంట్లకు మేలు జరుగుతుంది. - అజ్మీరా సుమన్, వరంగల్​