- గెలుపు గుర్రాలను సూచించాలని కేడర్‌కు పార్టీల ఆదేశాలు
- రెబల్స్ ఉండొద్దని సూచనలుజనరల్ స్థానాల్లోనూ బీసీలు పోటీ చేసే అవకాశం
- నేటి నుంచి ఫేజ్-1 సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలకు నామినేషన్లు
మహబూబ్‌నగర్, వెలుగు: సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. పార్టీ గుర్తుల మీద కాకుండా.. క్యాండిడేట్లకు ఎన్నికల సంఘం కేటాయించే గుర్తుల మీద పోటీ జరగనుండటంతో ఏ పార్టీ మద్దతుదారులు ఎక్కువ స్థానాల్లో గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా ఎదగాలని కాంగ్రెస్.. అధికార పార్టీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మెజార్టీ గ్రామ పంచాయతీలను దక్కించుకొని, గ్రామస్థాయి నుంచి పార్టీలను బలోపేతం చేయాలని బీఆర్ఎస్, బీజేపీ చూస్తున్నాయి.
కేడర్‌తో చర్చించాకే క్యాండిడేట్పై నిర్ణయం
కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అత్యధిక స్థానాలు గెలిస్తే వచ్చే జడ్పీటీసీ, ఎంపీపీ, మున్సిపల్, కార్పొరేషన్ఎన్నికల్లో పట్టు సాధించొచ్చని భావిస్తున్నాయి. దీంతో ప్రతీ గ్రామంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలనుకుంటున్నాయి. అయితే నామినేషన్దాఖలుకు మూడు రోజులే టైమ్ ఉండటంతో బుధవారం ఉదయం నుంచి అధికార కాంగ్రెస్‌కు చెందిన నియోజకవర్గ స్థాయి లీడర్లు మండల, గ్రామ స్థాయి నాయకులను పిలిపించుకుంటున్నారు. ఎన్నికల బరిలో ఎవరిని దింపుదాం? అక్కడ ఎంతమంది పోటీకి సిద్ధమవుతున్నారు? వారికి ప్రజల్లో బలం ఉందా? ఆర్థిక పరిస్థితి ఏంటి? ఓ లీడర్‌కు పార్టీ తరఫున మద్దతు ఇస్తే.. మరో వ్యక్తి రెబల్‌గా నామినేషన్వేస్తాడా? తదితర విషయాలు తెలుసుకుంటున్నారు.
గెలుపు గుర్రాలను సూచించాలని కోరుతున్నారు. కొన్ని స్థానాల్లో ఏడెనిమిది మంది పోటీ పడుతుండటంతో బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇద్దరు లీడర్ల చొప్పున క్యాండిడేట్ల లిస్ట్‌ను మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లు తెలిసింది. గురువారం మరోసారి చర్చించి ఇద్దరిలో ఒకరిని ఫైనల్చేయనున్నట్లు సమాచారం. ఇద్దరు లీడర్లు రాజీకి రాకపోతే మంత్రులు, ఎమ్మెల్యేలే అభ్యర్థులను ప్రకటిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రతిపక్ష పార్టీలు మాత్రం రెండు రోజులుగా కేడర్‌తో సమావేశం అవుతున్నాయి. కొన్ని జీపీలకు క్యాండిడేట్లను ఫైనల్ చేసినట్లు సమాచారం.
జనరల్ స్థానాల్లోనూ బీసీలకు అవకాశం
పంచాయతీ ఎన్నికలకు రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో గతంతో పోలిస్తే బీసీలకు స్థానాలు తగ్గాయి. నారాయణపేట జిల్లాలో నిరుడు బీసీలకు 84 స్థానాలు రిజర్వ్ కాగా.. 72 స్థానాలు కేటాయించారు. మహబూబ్నగర్జిల్లాలో గతంలో 97 స్థానాలు కేటాయించగా.. ఈసారి 86 రిజర్వ్అయ్యాయి. నాగర్‌కర్నూల్‌జిల్లాలో నిరుడు 83 జీపీలు రిజర్వ్ కాగా.. ఈసారి 61 స్థానాలు అలాట్ అయ్యాయి.
గద్వాలలో నిరుడు 80 స్థానాలు, ఈసారి 70 స్థానాలు కేటాయించారు. వనపర్తి జిల్లాలో గతంలో 62 స్థానాలు కేటాయించగా.. ఈసారి కూడా అవే రిజర్వ్ అయ్యాయి. అయితే స్థానాలు తగ్గిపోవడంతో మిగతా అన్ రిజర్వ్డ్ఉమెన్, అన్రిజర్వ్డ్స్థానాల్లోనూ బీసీలు పోటీ చేసేందుకు అవకాశం దక్కింది. దీనికితోడు కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తామని చెప్పడంతో దాదాపు అన్రిజర్వ్డ్, అన్ రిజర్వ్డ్ఉమెన్ స్థానాల్లో 30 శాతానికి పైగా బీసీలు పోటీ చేసే అవకాశాలున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
మొదటి విడత పంచాయతీ, వార్డు మెంబర్ల ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచి శనివారం వరకు నామినేషన్లు తీసుకోనున్నారు. ఉదయం10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టైం ఇచ్చారు. అయితే నామినేషన్ల స్వీకరణ కోసం 4 గ్రామ పంచాయతీలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేశారు. ఈ క్లస్టర్ లోనే ఆయా జీపీల నుంచి పోటీ చేయాలనుకుంటున్న క్యాండిడేట్లు నామినేషన్వేయాల్సి ఉంటుంది.
ఉమ్మడి జిల్లాలోని గ్రామ పంచాయతీ ఓటర్ల వివరాలు
జిల్లా పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
మహబూబ్‌నగర్ 2,48,222 2,51,349 11 4,99,582
నాగర్‌కర్నూల్ 3,23,015 3,24,316 11 6,47,342
నారాయణపేట 1,94,124 2,02,410 07 3,96,541
వనపర్తి 1,90,068 1,92,223 04 3,82,295
గద్వాల 1,93,627 1,99,781 10 3,93,418
