
- కంటి ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు వింత పరిస్థితి
- బ్లడ్ టెస్టుల కోసం గాంధీ, ఉస్మానియాకు రిఫర్
- చాలా దూరం కావడంతో జనం అవస్థలు
- సరోజిని దవాఖానకు రోజూ వెయ్యి మంది పేషెంట్లు
- ప్రతిరోజూ దాదాపు వంద మందికి బ్లడ్ టెస్టులు అవసరం
- ఇంతపెద్ద ఆసుపత్రిలో ల్యాబ్ లేకపోవడంపై విమర్శలు
నల్గొండ జిల్లాకు చెందిన వెంకటమ్మ కంటి సమస్యతో మే 1న హైదరాబాద్ లోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన డాక్టర్లు పలు టెస్టులు రాశారు. సీబీపీ, ఈఎస్ఆర్, సీఆర్పీ, సీరమ్ అమైలేస్, వీడీఆర్ఎల్ వంటి బ్లడ్ టెస్టులు, చెస్ట్ ఎక్స్ రే, హెపటైటిస్, ఇతర పరీక్షలు రాశారు. అయితే, ఆ టెస్టులు సరోజినిలో చేయరని, గాంధీ లేదా ఉస్మానియా ఆసుపత్రిలో చేసుకోవాలని డాక్టర్లు సూచించారు. అప్పటికే ఊరి నుంచి ఎంతో ప్రయాస పడి సరోజినీ ఆసుపత్రికి వచ్చిన వెంకటమ్మ ఎండలకు అలసిపోయింది. టెస్టుల కోసం గాంధీ, ఉస్మానియాకు వెళ్లలేక ఆసుపత్రి బయట ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్ లో చేయించుకుందామని వెళ్లింది. కానీ అక్కడ రూ. 2,500 అవుతాయని చెప్పారు.
దీంతో అంత డబ్బులేక ఆమె తిరిగి ఇంటికి వెళ్లి పోయింది. తర్వాత మళ్లీ మే 5న హైదరాబాద్ కు వచ్చి గాంధీ ఆసుపత్రికి టెస్టుల కోసం వెళ్లింది. అక్కడ సరోజినీదేవి ఆసుపత్రిలో టెస్టులు రాసిచ్చిన ఓపీ చూపగా, మళ్లీ గాంధీలో కొత్తగా ఓపీ తీసుకోవాలని చెప్పారు. గాంధీలో మళ్లీ ఓపీ తీసుకొని డాక్టర్ తో అవే టెస్టులు రాయించుకుంది. రిపోర్టుల కోసం రెండు రోజులు పడుతుందని చెప్పడంతో ఆమె మళ్లీ ఊరికి వెళ్లి, తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర నలుమూలల నుంచి కంటి సమస్యలతో హైదరాబాద్ లోని సరోజినీదేవి దవాఖానకు వస్తున్న పేషెంట్లు అవస్థలు పడుతున్నారు. సరోజినీలో ల్యాబ్ ఫెసిలిటీ లేదని, గాంధీ లేదా ఉస్మానియాకు వెళ్లి బ్లడ్ టెస్టులు చేయించుకుని రావాలని కొందరు పేషెంట్లకు డాక్టర్లు రాసిస్తున్నారు. సరోజినీ ఆసుపత్రికి, గాంధీ, ఉస్మానియాకు దాదాపు పది కిలోమీటర్ల దూరం ఉండటంతో అటూ ఇటూ తిరగలేక పేషెంట్లు ఇబ్బందులకు గురవుతున్నారు.
నిజానికి కంటి సమస్యతో వచ్చే వారికి బ్లడ్ టెస్టులు చేసే అవసరం చాలా తక్కువగా ఉంటుంది. అయితే, సరోజినీ ఆసుపత్రికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రోజూ సగటున వెయ్యి మంది వస్తుంటారు. వీరిలో సగటున పది శాతం మందికి రక్త పరీక్షలు అవసరం అవుతుండగా.. వీరందరినీ గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన పేషంట్లు టెస్టుల కోసం అంతదూరం వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు వేలు ఖర్చుచేసి దగ్గర్లోని ప్రైవేట్ సెంటర్లలో టెస్టులు చేయించుకుంటుంటే, మరికొందరు ఎండలకు ఇబ్బందులు పడుతూ గాంధీ లేదా ఉస్మానియాకు వెళుతున్నారు.
తెలంగాణ డయాగ్నస్టిక్స్ కు లింక్ చేయాలి..
ప్రస్తుతం తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా సీహెచ్ సీలు, యూపీహెచ్ సీలలో పేషెంట్ల నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారు. దీనికోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే, పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల వంటి చిన్న చిన్న సెంటర్లు కూడా రక్తం, మూత్రం శాంపిల్స్ సేకరించి తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్‌కు పంపుతున్నాయి. ఫలితాలు మొబైల్‌కు చేరవేస్తున్నారు. ఇది రోగులకు సౌకర్యవంతంగా ఉంది. కానీ, సరోజినీ వంటి పెద్ద కంటి ఆసుపత్రిలో ఈ వ్యవస్థ లేకపోవడంపై పేషెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో ల్యాబ్ ఏర్పాటు చేయాలని, ఆలోపు తెలంగాణ డయాగ్నస్టిక్స్ కు ఈ ఆసుపత్రిని లింక్ చేసి శాంపిల్స్ సేకరించేలా చర్యలు తీసుకోవాలని పేషెంట్లు కోరుతున్నారు.
60 ఏండ్ల ఆసుపత్రిలో ల్యాబ్ లేదు
సరోజినీదేవి కంటి ఆసుపత్రికి 60 ఏండ్ల చరిత్ర ఉంది. రోజూ వేలాది మంది పేషెంట్లు వస్తుంటారు. దాదాపు 500 బెడ్లు ఉన్న ఇంత పెద్ద ఆసుపత్రిలో ల్యాబ్ ఫెసిలిటీ లేకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రక్త పరీక్షలు, ఇతర టెస్టులు అవసరమైతే గాంధీ లేదా ఉస్మానియాకు వెళ్లాల్సిందే. లేదంటే ప్రైవేట్ సెంటర్లలో వేలు ధారపోసి టెస్టులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. సాధారణంగా డయాబెటిక్ రెటీనోపతి, ఇన్ ఫ్లమేటరీ ఐ డీసీజ్, గ్రేవ్స్ డీసీజ్, కంటి ఇన్ఫెక్షన్లు, ఆటోఇమ్యూన్ డిజాస్టర్లు, లిపిడ్ ప్రొఫైల్, విటమిన్ లోపాలతో కూడిన కంటి సమస్యలకు రక్త పరీక్షల అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడికి వచ్చేవారిలో రోజూ దాదాపు వంద మందికి బ్లడ్ టెస్టులు అవసరం అవుతోంది. కానీ ఇక్కడ ల్యాబ్ ఫెసిలిటీ లేకపోవడంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారు.
రిఫర్ చేయక తప్పట్లేదు
మా ఆసుపత్రిలో ల్యాబ్ లేదు. దీంతో పేషెంట్లను గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు రిఫర్ చేయక తప్పట్లేదు. కంటి సమస్య ఉన్న పేషెంట్లకు రక్త పరీక్షల అవసరం చాలా తక్కువ. అయినా, ప్రభుత్వం ల్యాబ్ మంజూరు చేస్తే ప్రతి నెలా కొన్ని వందల మందికి ఇబ్బందులు తప్పుతాయి. డాక్టర్ మోదిని, సూరింటెండెంట్, సరోజినీదేవి కంటి ఆసుపత్రి