- రాజకీయాల్లో సినిమా డైలాగులు పనికిరావు
- కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదు
- తెలంగాణ గురించి ఇష్టంవచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓ తోలుబొమ్మ అని.. బీజేపీ ఎలా ఆడిస్తే ఆయన అలా ఆడుతున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. నోటికొచ్చినట్టుగా మాట్లాడడానికి ఇది సినిమా కాదని, రాజకీయాల్లో సినిమా డైలాగులు పనికిరావని చురకలంటించారు. ‘రాజకీయాల్లో పవన్ చాలా చిన్నవాడు. ఆయన ఇంకా ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదు.
‘‘కాంగ్రెస్‌ను విమర్శించడం అంటే సినిమాలో డైలాగ్ చెప్పినంత ఈజీ కాదని గుర్తించాలి. తెలంగాణ ప్రజలు నీ సినిమాలు చూడకపోతే నువ్వు ఇంత పెద్ద హీరో అయ్యేవాడివా?’’ అని మహేశ్ గౌడ్ ప్రశ్నించారు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఆ రాష్ట్రంలో పవన్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని గుర్తుచేశారు. అధికారం ఉందని తెలంగాణ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికావన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పవన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో రాజకీయాల కోసం మమ్మల్ని విమర్శిస్తే సహించబోమన్నారు. పవన్ వ్యాఖ్యలపై కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
వారి మధ్య ఉన్న ఒప్పందం ఏమిటని నిలదీశారు. రెండు రాష్ట్రాలు విడిపోయాయని, ఇప్పుడు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని పీసీసీ చీఫ్ పిలుపునిచ్చారు. బీజేపీ–పవన్ మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందం వల్లే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ‘అసలు తెలంగాణ ఉద్యమ సమయంలో పవన్ ఎక్కడ ఉన్నాడు? ఏ సినిమా షూటింగ్‌లో ఉన్నాడు?’ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ కలను సాకారం చేసింది సోనియా గాంధీయేనని, మీ నాయకుడు మోదీ రాకెట్ల ముందు ఫొటోలు దిగుతున్నారని అన్నారు. అది కాంగ్రెస్ ప్రభుత్వ ఘనతేనన్నారు.
గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
గిరిజనుల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. దేశంలో గిరిజనులు సామాజికంగా, విద్యా పరంగా ఎదగడానికి మాజీ ప్రధాని ఇందిరమ్మే కారణమని గుర్తుచేశారు. ప్రధానిగా ఆమె గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఆదివాసి ప్రజాప్రతినిధులు ‘బస్సు యాత్ర’ నిర్వహించాలని పిలుపునిచ్చారు. సోమవారం గాంధీ భవన్లో జరిగిన పీసీసీ ఆదివాసీ లీడర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గ్రామీణ ప్రాంత ప్రజల పరిస్థితులను తెలుసుకోవడంలో ఇందిరా గాంధీ ఎప్పుడూ ముందే ఉండేవారని కొనియాడారు. ఇందిరమ్మ గిరిజనులకు చేసిన సేవలను ఈ బస్సు యాత్ర ద్వారా తెలంగాణ ప్రజలకు వివరించాలని కోరారు. ఈ సమావేశంలో గిరిజన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు బలరాం నాయక్, శంకర్ నాయక్, రాంచంద్రు నాయక్, బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
