
- బెంగూళూరు ఏఐసీసీ ఓబీసీ సలహా మండలి సమావేశంలో మహేశ్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బెంగళూరులో రెండు రోజుల పాటు జరిగిన ఏఐసీసీ ఓబీసీ జాతీయ సలహా మండలి సమావేశంలో చివరి రోజైన బుధవారం పీసీసీ చీఫ్మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ను ప్రకటించామని, ఆ సమయంలో కర్నాటక సీఎం సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారని గుర్తుచేశారు. అప్పుడు తాను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీసీ డిక్లరేషన్ ను ప్రతిపాదించానని చెప్పారు. దీనిపై బిల్లు చేసిన సమయంలో పీసీసీ చీఫ్ పాత్ర పోషించడం తనకు గర్వంగా ఉందన్నారు. బీసీ రిజర్వేషన్లలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, తాను సైనికుల్లా పని చేశామని చెప్పారు.
‘‘మనమెంతో.. మనకంతా..’’ అనే నినాదాన్ని అమలు చేసేందుకు రాహుల్ కలలు గన్న బీసీ రిజర్వేషన్లను తెలంగాణలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి అయినా రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం న్యాయ, చట్ట, రాజకీయ పరంగా ఎక్కడా, ఏ ఇబ్బంది రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఈ అక్టోబర్ లో ఏఐసీసీ ఓబీసీ సలహా మండలి సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించనున్నామని మహేశ్ గౌడ్ చెప్పారు. ఏఐసీసీ ఓబీసీ సలహా మండలి జాతీయ చైర్మన్, కర్నాటక సీఎం సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రం నుంచి పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.