జోడువాగుల వద్ద రోడ్డు విస్తరణకు కేంద్రం 100 కోట్లు : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

జోడువాగుల వద్ద రోడ్డు విస్తరణకు కేంద్రం 100 కోట్లు :  ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • రిపేర్లకు మరో రూ.1.80 కోట్లు మంజూరు 
  • కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి 
  • త్వరలోనే పనులు ప్రారంభిస్తామని వెల్లడి 
  • ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన స్పీకర్ ప్రసాద్, ఎంపీలు వంశీకృష్ణ, విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ 

న్యూఢిల్లీ, వెలుగు: నిజామాబాద్– జగదల్ పూర్ నేషనల్ హైవేలో భాగంగా చెన్నూరు నియోజకవర్గం భీమారం, చెన్నూరు మండలాల మధ్యలోని జోడువాగుల వద్ద రోడ్డు విస్తరణకు కేంద్రం ఇటీవల రూ.100 కోట్లు మంజూరు చేసిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జోడువాగుల బ్రిడ్జికి ఇరువైపులా రోడ్డు డ్యామేజీ కావడంతో రిపేర్లకు మరో రూ.1.80 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ నేతృత్వంలో ఎంపీలు వంశీకృష్ణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్రంలో రోడ్లను విస్తరించాలని, నేషనల్ హైవేలుగా అప్ గ్రేడ్ చేయాలని, కొత్త రోడ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా జోడువాగుల వద్ద రోడ్డు విస్తరణ, రిపేర్లకు నిధులు కేటాయించినందుకు గడ్కరీకి ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఎన్ హెచ్ –63 మొత్తం ఫోర్ లేన్స్ కాగా, భీమారం మండలం కేంద్రం నుంచి 2 కిలోమీటర్ల వరకు ఫారెస్ట్ ల్యాండ్ ఉండడంతో అక్కడ రోడ్డు రెండు లేన్లుగానే ఉందని తెలిపారు. ఇక్కడ రోడ్డు ఇరుకుగా ఉండడంతో పెద్ద సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు.

‘‘ఈ విషయాన్ని నాలుగు నెలల కింద సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, నేను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లాం. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి జోడువాగుల వద్ద రోడ్డు విస్తరణకు ఇటీవల రూ.100 కోట్లు మంజూరు చేశారు. అలాగే జోడువాగుల వద్ద డ్యామేజ్ అయిన రోడ్డు శాశ్వత మరమ్మతులకు రూ.1.80 కోట్లు కేటాయించారు. తక్షణమే ఈ రోడ్డు పనులు ప్రారంభిస్తాం” అని వెల్లడించారు. 

త్వరలో పనులు ప్రారంభం: ఎమ్మెల్యే వివేక్ 

జోడువాగుల వద్ద రోడ్డు విస్తరణ కోసం ఎంపీ వంశీకృష్ణ పెట్టిన ప్రతిపాదనకు కేంద్రం అనుమతి ఇచ్చిందని ఎమ్మెల్యే వివేక్ తెలిపారు. ‘‘జోడువాగుల వద్ద రోడ్డు విస్తరించకపోవడం, పురాతన బ్రిడ్జి కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో చాలామంది చనిపోయారు. ఈ విషయాన్ని గతంలో కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లాం. సీఎం రేవంత్ తో కలిసి ఇచ్చిన విజ్ఞప్తిపై ఇటీవల కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో రోడ్డు పాడైన చోట తాత్కాలిక మరమ్మతులు జరుగుతున్నాయి. కేంద్రం తాజాగా మంజూరు చేసిన రూ.1.80 కోట్లతో 10 నుంచి 15 రోజుల్లో పర్మనెంట్ పనులు ప్రారంభమవుతాయి” అని తెలిపారు.

3 రోడ్లను అప్ గ్రేడ్ చేయండి: స్పీకర్ ప్రసాద్ 

వికారాబాద్ నియోజకవర్గంలోని ముఖ్యమైన 3 స్టేట్ హైవేలను నేషనల్ హైవేలుగా అప్ గ్రేడ్ చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని స్పీకర్ ప్రసాద్ కోరారు. అదే విధంగా నియోజకవర్గంలోని 7 రోడ్లకు సెంట్రల్ రోడ్ ఇన్ ఫాస్ట్రక్చర్ ఫండ్స్ స్కీమ్​(సీఆర్ఐఎఫ్) కింద నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రోడ్ల విస్తరణకు నిధులు ఇవ్వాలని కేంద్రమంత్రి గడ్కరీని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కోరారు. మన్నెగూడ హైవేను నేషనల్ హైవేగా మార్చాలని విజ్ఞప్తి చేశారు.  రాజకీయాలు పక్కనపెట్టి, అభివృద్ధి కోసం వచ్చానని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు, స్పీకర్ ఓఎస్డీ వెంకటేశం, లీడర్ మాణిక్ రెడ్డి పాల్గొన్నారు.

కేరళ ఎక్స్ ప్రెస్​కు మంచిర్యాల స్టేషన్​లో హాల్టింగ్ ఇవ్వండి 

బెల్లంపల్లి నుంచి తిరుపతికి కొత్త ట్రాక్ వేయాలని రైల్వే బోర్డును పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ తో కలిసి రైల్వే బోర్డు చైర్మన్ సతీశ్ కుమార్ ను ఆయన కలిశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి, చెన్నూరు నియోజకవర్గాలకు సంబంధించిన రైల్వే ప్రాజెక్టులు, కొత్త ట్రాక్ ల నిర్మాణం, పలు రైళ్ల హాల్టింగ్ పై వినతిపత్రాలు అందజేశారు. తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో వందేభారత్ ట్రైన్ ఆపేలా చర్యలు తీసుకున్నందుకు రైల్వే బోర్డు చైర్మన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘కేరళ ఎక్స్ ప్రెస్ కు మంచిర్యాల స్టేషన్ లో హాల్టింగ్ ఇవ్వాలని రైల్వే బోర్డు చైర్మన్ ను కోరాం. దీనివల్ల శబరిమలకు వెళ్లే యాత్రికులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అలాగే బెల్లంపల్లి నుంచి తిరుపతికి కొత్త రైల్వే లైన్ వేయాలని వినతిపత్రం అందజేశాం” అని వంశీకృష్ణ తెలిపారు.