మొదటి విడత ప్రచారం షురూ.. ఇంటింటికీ తిరిగి ఓట్లు అడుగుతున్న క్యాండిడేట్లు

 మొదటి విడత ప్రచారం షురూ.. ఇంటింటికీ తిరిగి ఓట్లు అడుగుతున్న క్యాండిడేట్లు
  • రేపు రెండో విడత గ్రామ పంచాయతీల నామినేషన్​ల ఉపసంహరణ

మహబూబ్​నగర్​, వెలుగు :మొదటి విడత సర్పంచ్​, వార్డు మెంబర్ల ఎన్నికలకు టైం దగ్గర పడుతోంది. ఇప్పటికే నామినేషన్ల​ విత్​ డ్రా పూర్తి కావడంతో.. బరిలో నిలిచిన క్యాండిడేట్లు, వారికి కేటాయించిన గుర్తులను బుధవారం అర్ధరాత్రి ఆఫీసర్లు ప్రకటించారు. దీంతో గురువారం ఉదయం నుంచి క్యాండిడేట్లు ప్రచారాన్ని ప్రారంభించారు. తమ అనుచరులు, బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి ఇంటింటికీ తిరుగుతున్నారు. పోలింగ్​కు కేవలం ఆరు రోజులే ఉండడంతో గ్రామాల్లో ప్రచార రథాలను తిప్పుతున్నారు. తమకు కేటాయించిన గుర్తులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. 

తేలిన అభ్యర్థుల లెక్క

మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో ఎంత మంది పోటీలో ఉంటున్నారనే విషయం బుధవారం అర్ధరాత్రి తర్వాత తేలింది. మహబూబ్​నగర్​ జిల్లాలోని గండీడ్​, మహమ్మదాబాద్​, రాజాపూర్​, నవాబుపేట, మహబూబ్​నగర్​ రూరల్​ మండలాల్లోని 139 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో పది గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. 129 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 425 మంది సర్పంచ్ స్థానాల కోసం పోటీ పడుతున్నారు. 

జిల్లాలో 1,188 వార్డులు ఉండగా.. ఇందులో 264 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 923 వార్డులకు ఎన్నికలు జరగనుండగా 2,195 మంది బరిలో నిలిచారు. నారాయణపేట జిల్లాలోని గుండుమాల్​, కోస్గి, కొత్తపల్లి, మద్దూరు మండలాల్లోని మొత్తం 67 గ్రామ పంచాయతీలుండగా.. ఇందులో 14 గ్రామ పంచాయతీ ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 53 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా.. సర్పంచు స్థానాలకు 156 మంది బరిలో నిలిచారు. అలాగే 572 వార్డులకు గాను 210 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 361 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. 834 మంది పోటీ పడుతున్నారు. 

రెండో విడత గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవాలకు చర్చలు

రెండో విడత ఎన్నికలు జరగనున్న గ్రామ పంచాయతీల్లో నామినేషన్​ల ప్రక్రియ పూర్తైంది. శనివారం నామినేషన్ల విత్​ డ్రా జరగనుంది. రెండవ విడత పంచాయతీల్లో ఇప్పటి వరకు ఏకగ్రీవాలు జరగలేదు. అన్ని పంచాయతీల్లో క్యాండిడేట్ల మధ్య పోటాపోటీ ఉంది. దీంతో లీడర్లు రంగంలోకి దిగుతున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన ఆశావహులు ఒక్కో చోట ఇద్దరు, ముగ్గురు నామినేషన్​లు వేయడంతో ఆయా పార్టీ లీడర్లు వారిని బుజ్జగిస్తున్నారు. 

నామినేషన్లు విత్​ డ్రా చేసుకుంటే నామినేటెడ్​ పదవులు ఇస్తామని, లేదంటే రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అవకాశాలు కల్పిస్తామని హామీలు ఇస్తున్నారు. ఎన్ని విధాల నచ్చజెప్పినా క్యాండిడేట్లు దిగి రావడం లేదని తెలిసింది. కచ్చితంగా పోటీ చేస్తామంటూ పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది.