3 జాతీయ ఆయుష్ ఇన్స్టిట్యూట్లను ప్రారంభించిన మోడీ 

 3 జాతీయ ఆయుష్ ఇన్స్టిట్యూట్లను ప్రారంభించిన మోడీ 

గోవా: ఆయుర్వేదాన్ని సంప్రదాయ వైద్య విధానంగా ఇప్పటికే 30 దేశాలకుపైగా ఆమోదించాయని  ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మన ఆయుర్వేద వైద్య విధానాన్ని మొత్తం ప్రపంచమే గుర్తిస్తోందని ఆయన చెప్పారు. గోవాలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ మూడు జాతీయ ఆయుష్ ఇన్ స్టిట్యూట్ లను ప్రారంభించారు. రూ.970 కోట్లతో  ఆయుష్ ఇన్ స్టిట్యూట్ లను అభివృద్ధి చేశారు. ఆ తర్వాత 9వ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్, హెల్త్ ఎక్స్ పోలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. 50కి  పైగా దేశాలు ఈ ఆయుర్వేద ఎక్స్ పోలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోడీ భారతదేశ సంప్రదాయాలను మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఇది ఒక ముఖ్యమైన ప్రయత్నం అన్నారు. ఇతర దేశాల్లోనూ ఆయుర్వేదాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. 

ఆయుర్వేదం చికిత్స మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తోంది

ఆయుర్వేదం కేవలం చికిత్స మాత్రమే కాదని.. ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తోందని మోడీ వివరించారు. యోగా, ఆయుర్వేదం ప్రపంచానికి కొత్త మార్గంగా కనిపిస్తోందన్నారు. ఆయుర్వేద వైద్యంపై డేటా బేస్డ్ ఎవిడెన్స్ డాక్యుమెంటేషన్ చేయాలన్నారు. అంతకు ముందు 2 వేల 870 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన మోపా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మోడీ ప్రారంభించారు. ఈ విమానాశ్రయ నిర్మాణానికి 2016లో ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. అత్యాధునిక పద్దతిలో నిర్మించిన ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు మొదటి దశ పనులు పూర్తి కావడంతో ఇవాళ ప్రారంభోత్సవం చేశారు.