అమూల్ పాలలో యూరియా ఉందని ఫేస్‌బుక్ వీడియోలో పేర్కొన్నందుకు గానూ గుజరాత్‌లోని గాంధీనగర్ నగరంలో ఓ వ్యక్తిపై (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) ఎఫ్‌ఐఆర్ నమోదైంది. జూలై 4న అదాలజ్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. కానీ ఆ వ్యక్తిని మాత్రం అరెస్టు చేయలేదని అధికారులు తెలిపారు.
అమూల్ బ్రాండ్‌ను కలిగి ఉన్న గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జిసిఎంఎంఎఫ్) తయారీ యూనిట్ అమ్ల్ఫెడ్‌లో సీనియర్ సేల్స్ మేనేజర్ అంకిత్ పారిఖ్ ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. గాంధీనగర్ నివాసి అయిన లక్ష్మీకాంత్ పర్మార్ ఫేస్‌బుక్ వీడియోలో అమూల్ బ్రాండ్‌ను దూషించాడని, ప్యాక్ చేసిన పాలలో యూరియా ఉందని పారిఖ్ ఆరోపించారు. ప్రభుత్వ ప్రయోగశాల కూడా ఈ విషయాన్ని ధృవీకరించిందని వీడియోలో పేర్కొన్నాడు.
అమూల్ బ్రాండ్ ప్రతిష్టను దెబ్బతీయడంతోపాటు పుకార్లను వ్యాప్తి చేయడమే లక్ష్యంగా ఈ వీడియోను రిలీజ్ చేశారని పారిఖ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. పర్మార్‌పై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 500 (పరువు నష్టం), 505 (ప్రజా దుర్మార్గానికి దారితీసే స్టేట్‌మెంట్లు) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
