ప్రజావేదనలు పోగొట్టేందుకు.. కొత్త ఆలోచనలు చేయాలి

ప్రజావేదనలు పోగొట్టేందుకు.. కొత్త ఆలోచనలు చేయాలి

తోటి మానవులను కష్టనష్టాలకు గురిచేసే దుడుకు స్వభావం కలవారిని చట్టపరంగా సరైన మార్గంలో పెట్టేందుకు పోలీసు వ్యవస్థ అనాదిగా తనవంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే ఉన్నది. అయితే ప్రజలు, పాలకుల్లో గత రోజుల్లో ప్రమాణాలు, పాపభీతి మెండుగా ఉండేవి. కాబట్టి పోలీసుల అవసరం ఎప్పుడో కాని కలిగేది కాదు. కలిగినప్పుడు పనికి జవాబుదారీతనం ఉండేది. అలసత్వానికి, బాధ్యతారాహిత్యానికి శాఖాపరమైన చర్యలు కఠినంగా ఉండేవని చరిత్ర చెబుతున్నది. అందువలన, పోలీసులు తమ బరువు బాధ్యతలను గుర్తెరిగి నిర్వహిస్తుండేవారు.

వారికి ప్రజలతో ఎంతో మంచి సంబంధాలు ఉండేవి. పాలకుల విశ్వాసాన్ని చూరగొనేవారు. రాచరికాలు అంతరించాయి. ప్రజలే ప్రభువులుగా పాలన సాగిస్తున్నారు. తదనుగుణంగా చట్టాలు  క్రోడీకరించబడినాయి. ప్రజలకు, పోలీసులకు, పాలకులకు అధికారాలు, పరిధులు, బాధ్యతలు నిర్వచించబడినాయి. చట్టాలు అమలుచేసే క్రమంలో ఎదుర్కొను ఒడుదొడుకుల పరిష్కారానికి, ఇతర సలహా సంప్రదింపులకు దక్షతగలవారిని ఉన్నత అధికారులుగా నియమించేవారు. 

స్వాతంత్ర్యోద్యమంలో త్యాగాలు చేసినవారు ప్రజాపాలకులుగా ఎన్నికైనవారు కావున ప్రమాణాలు పాటించేవారు. వారి విలువలు, త్యాగాలు, ప్రజల నోళ్లలో కదలాడుతుండేవి. ప్రభుత్వోద్యోగులు పాలకుల విలువలకు తగినట్లుగా పనిచేయాలనే ఉత్సుకతతో ఉండేవారు. తప్పుచేసినవారు ప్రజల సమక్షంలో అభిశంసనకు గురి అవుతుండేవారు. ఆ తరం వారు పాలకులుగా ఉన్నంతవరకు ప్రజాపాలన సాఫీగానే సాగింది. పాలన అర్థవంతంగా సాగినంతకాలం పోలీసులు, ఇతర ప్రభుత్వోద్యోగులు సమర్థవంతంగా పనిచేశారు.

క్రమేణా పాలకుల్లో విలువలు క్షీణించసాగాయి. పదవులపై కాంక్ష పెరిగింది. వాటిని నిలుపుకోవటానికి అడ్డదారులు కనుగొన్నారు. అన్నిరకాల ప్రలోభాలు, ప్రయోగాలు దినచర్యగా మారాయి. కులమతాలు ఓటర్ల సమీకరణకు బలమైన అంశాలుగా మారాయి. తద్వారా ప్రేరితులైన జనం అదే దిశలో సమీకరణాలు మొదలుపెట్టారు. దైనందిన జీవనక్రమంలో ప్రజల్లో తలెత్తుతున్న బేధాభిప్రాయాలు విపరీతమై, విషతుల్యమై కక్షలకు దారితీయడం చూస్తూనే ఉన్నాం. ఆగ్రహోదగ్రులైనవారు దాడులకు దిగడం నిత్యకృత్యమై పోయింది. 

పోలీసులకూ సమస్యగా మారింది

చట్టం ముందు దోషులుగా నిలబడినవారు.. సదరు అభియోగాల నుంచి బయటపడాలనుకునేవారు కొందరు, ప్రత్యర్థులను తప్పుడు కేసుల్లో ఇరికించాలనుకునేవారు ఇంకొందరు. అందరూ తమదైన శైలిలో తలమునకలైపోతున్నారు. అలాంటి దుష్కార్యాలు నిర్వహించడానికి చట్టం ద్వారా అధికారాలను సంతరించుకున్న పోలీసు శాఖను ఒక బలమైన ఆయుధంగా ఎంచుకున్నారు. అధికారంలో ఉన్న పార్టీలు, దానికి పొందాలనుకునే పార్టీలు అదేపనిగా పోలీసులను తమ స్వంత ప్రయోజనాలకు వాడుకోవడం,  ఆ అవకాశాలను పొందలేని పార్టీలు పోలీసులను ఆడిపోసుకోవడం అనునిత్యం జరుగుతున్నది. తమ అభీష్టం మేరకు పనిచేసే పోలీసులకు పొగడ్తలు, చేయనివారికి తెగడ్తలే మరి.

ఏది ఎలాఉన్నా ప్రజల సమస్యలు మాత్రం తీరని సమస్యలుగానే మిగిలాయి. పోలీసుల్లో దాదాపుగా అన్ని హోదాలను ఆ జాడ్యం తాకడంతో వారు కూడా ప్రజలకు చట్టం ఆశయం మేరకు సేవలందించడం ఒక సమస్యగా మారింది. చట్టం అతిక్రమణకు పాల్పడుతున్న కొందరు రాజకీయ నాయకులు, వారి అనుయాయులు పోలీసు శాఖను అడ్డంపెట్టుకుని ఆర్థికంగా ఎంతో లబ్ధిని పొందుతూ ఆ శాఖను అప్రతిష్టపాలు చేస్తున్నారు. పర్యవసానంగా సామాజిక, పరిపాలన వ్యవస్థలు బలహీనపడుతున్నాయి. 

లంచం ఇవ్వడం, పుచ్చుకోవడం వ్యసనమైంది

లంచాలతోనే అన్ని విధాల పనులు నెరవేర్చుకోవడం సుగమం అని తోచడంతో చివరకు ప్రజలకు సైతం లంచాలివ్వడం అలవాటుగా మారింది. పాలకుల్లో లంచాల వ్యసనం ఎదిగి ఎదిగి స్కాములు పుట్టుకొచ్చాయి. ఒకటి, రెండు పార్టీలు మినహాయిస్తే అన్ని పార్టీలు, పాలకులు స్కాముల పరంపరను కొనసాగిస్తున్నారు. దొరికినవారు అరెస్టుకావడం, కోర్టు కేసుకు బాధ్యులుగా శిక్షలకు గురికావడం నేటికీ కొనసాగుతోంది. ప్రతిపనికి, ప్రతి పదవిని సంపాదించుకోవడానికి, ఓట్లను కొనుక్కోవడం ఒక ఖరీదైన పెట్టుబడిగా పరిణమించింది. 

నిజాయితీపరులు కుంగిపోతున్నారు

ప్రభుత్వ ఆదాయానికి పౌరుడు చెల్లించే పన్నుయే గాలి, నీరు, ఆహారం. ఆ పన్నును ప్రజావసరాలకు వినియోగించే క్రమం ఓ ప్రహసనంగా మారింది. ఆ విధంగా పరిపాలన వ్యవస్థ, వృత్తి ధర్మ నిర్వహణపరంగా సంక్రమించిన అధికారాలన్నీ సంతలోని సరుకులుగా మారాయి. పాలకులు ఆలోచించేదొకటి, చెప్పేదొకటి, చేసేది ఇంకొకటి. ప్రతిదినం ఎవరిని ముంచాలి, ఎవరిని ఆశ్రయించాలి. అనే విషయాలపైనే పాలకులు, ప్రభుత్వాధికారులు, సామాజిక పెద్దలు దృష్టి సారిస్తున్నారు. ప్రమాణాల దిశగా ప్రజలను ప్రభావితం చేయగల నాయకులు కరువైపోతున్నారు. హింసావాదం పెరిగిపోతోంది.

దేశ అంతర్గత భద్రత గురించి తీవ్రంగా ఆలోచించవలసిన అగత్యం ఏర్పడింది. రాష్ట్రాల్లో పాలకులు, ప్రభుత్వాధికారులు ఉత్తర సాక్ష్యంతో తమ వ్యక్తిగత పలుకుబడికి భంగం కలగనీయకుండా జాగ్రత్తపడుతున్న ఉత్తర కుమారులయ్యారు. ఫలితంగా సగటు మనిషి ఎన్నో కష్టాలకు లోనవుతున్నాడు. చట్టాన్ని గౌరవించడం మూలంగా ఇన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తున్నదని బాధితులు  మదనపడుతున్నారు.

చట్టాన్ని ఉల్లంఘించి సంపాదనకు మరిగినవారు దర్జాగా తమముందు తిరుగుతుంటే ఆత్మవంచన చేసుకోలేక, మనసొప్పని పరిస్థితులను జీర్ణీంచుకోలేక అల్పసంఖ్యాకులుగా మిగిలిన నిజాయతీపరులైన పాలకులు, ప్రభుత్వోద్యోగులు ప్రత్యేకంగా పోలీసు ఉద్యోగులు కుంగి కృశించి పోతున్నారు. 

పతనమైన రాజకీయ విలువలు

అలుపెరగని ప్రజాస్వామ్య కాలచక్రం మాత్రం తిరుగుతూనే ఉన్నది. విశ్లేషణాత్మకంగా పరిశీలించినప్పుడు నేటి పాలకుల ప్రవర్తనల్లో శాసనోల్లంఘనలు, అధికార దుర్వినియోగం, ఆశ్రిత పక్షపాతం తదితర దుర్గుణాలు కొట్టొచ్చినట్లు కనపడుతున్నవి. పర్యవసానంగా చట్టం చట్టుబండలై పోయింది. పౌరహక్కుల ఉల్లంఘనకు గురవుతున్నాయి. నేరానికి శిక్ష అరుదుగా మారింది. రాజకీయ విలువల పతనం పరాకాష్టకు చేరుకోవడంతో పార్టీలు, శాసనసభ బయట, లోపల సిగపట్లతో  కాలయాపన చేసుకోవడం దినచర్యగా మారింది. అధికంగా రాజకీయ పార్టీలు దళారితనాన్ని సంతరించుకున్న దోపిడీ వ్యవస్థలుగా మారాయి. వ్యాపారసంస్థలుగా వెలిసి వెర్రితలలు వేస్తూ ప్రజాభివృద్ధికి కంటకప్రాయంగా మారాయి. ఆ విషయాన్ని అంగీకరించడానికి  ప్రజానాయకులు మాత్రం మొహం చాటేస్తున్నారు. 

కొత్త నాయకులు కొత్తగా ఆలోచించాలి

 సమాజ వికాసం కర్రగలవానిదే బర్రె అనే చందంగా తయారైంది. కాబట్టి,  కొత్త ప్రజానాయకత్వాలు కొత్త ఆలోచనలు చేయాల్సిఉంది. సమాజంలో విశ్వాసం పెంపొందించాల్సి ఉంది.  ఎందుకంటే, చట్టాన్ని గౌరవిస్తూ, ఆచరిస్తున్నా తాము ఎదర్కోవలసి వస్తున్న బాధలకు పౌరసమాజం అలసి సొలసి సొమ్మసిల్లి పోతున్నది. చివరి ఆశగా పౌర సమాజం అంతా యువత వైపు చూస్తున్నది. ఆ ఖాళీని పూరించడానికి పిలుపునిస్తూ ఎంతో ఆవేదనతో ఆహ్వానిస్తున్నది. 

చట్టాన్ని చేతిలోకి తీసుకొని..

చట్టాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్న నేతలు జన సామాన్యులపై పెత్తనం చెలాయిస్తున్నారు. ఆకతాయిలు, ఆగడాలకు పాల్పడేవారిని ప్రోత్సాహమిస్తూ దౌర్జన్యంతో సామాన్యులను సైతం తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఆ దౌర్జన్యకారుల దాడుల నుంచి కాపాడుకోవాలనుకొనేవారు ముడుపుల చాటున రక్షణ పొందుతున్నారు. అదొక నిరంతర ప్రక్రియగా మారింది. ధన దాహానికి మరిగినవారు పక్కదారులెన్నో వెతుకుతూభూ కబ్జాలకు పాల్పడటం, ప్రభుత్వ పనులకు కేటాయించిన బడ్జెట్​ నుంచి పర్సంటేజులు మెక్కడం మొదలైంది. ఇది విస్తృతమై పర్సంటేజుల జబ్బు పాలకుల్లో, అటు ప్రభుత్వాధికారుల్లో అన్ని హోదాలవారిని తాకింది. క్రమేపీ అదో హక్కులా మారింది. అక్కడక్కడ ఎవరైనా నిజాయితీపరులైన ఉద్యోగులు తగిలితే వారిని ఎందుకూ పనికిరానివారిగా అన్నింటా నిర్లక్ష్యానికి గురిచేయడం జరుగుతోంది.

పెద్దిరెడ్డి తిరుపతి రెడ్డి,ఏఎస్పీ  (రిటైర్డ్)