- బీఆర్ఎస్కు ఓటమి భయం పట్టుకున్నది: మంత్రి పొన్నం
జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్.. విద్యావంతుడు, స్థానికుడు అని, నిత్యం ప్రజల్లో ఉండే మనిషి అని ఏఐసీసీ స్టేట్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. జూబ్లీహిల్స్ అభివృద్ధికి పని చేస్తారని, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నవీన్ లాంటి వ్యక్తిని గెలిపిస్తే జూబ్లీహిల్స్ లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని తెలిపారు. యూసుఫ్గూడా డివిజన్ లోని హైలం కాలనీలో మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి మీనాక్షి నటరాజన్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా నిలవాలని కోరారు. మహిళలు, వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ చేతి గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి గతంలో ఏ ప్రభుత్వం చేయలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. బీఆర్ఎస్ లీడర్లు ఓటమి భయంతో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
