కిడ్నాప్ చేయించింది మొదటి భార్యే.. ఆస్తిలో వాటా ఇవ్వనందుకు హత్యకు కుట్ర

కిడ్నాప్ చేయించింది మొదటి భార్యే.. ఆస్తిలో వాటా ఇవ్వనందుకు హత్యకు కుట్ర
  • డీడీ కాలనీ వ్యాపారి కిడ్నాప్​ కేసులో 10 మంది అరెస్ట్ 
  • మూడు కార్లు, రెండు బైక్​లు,8 సెల్ ఫోన్లు స్వాధీనం

అంబర్ పేట, వెలుగు: అంబర్​పేట డీడీ కాలనీలో వ్యాపారి కిడ్నాప్​కేసును పోలీసులు ఛేదించారు. అతడికి ఇద్దరు భార్యలు ఉండగా.. మొదటి భార్యే కిడ్నాప్​ చేయించినట్లుగా పోలీసులు తేల్చారు. కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ డాక్టర్ బి.బాలస్వామి వెల్లడించారు. 

బాగ్ అంబర్ పేట్ డీడీ కాలనీలో గత నెల 29న మంత్రి శ్యామ్ అనే వ్యక్తిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్​ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సాంకేతిక సాయంతో ఓ చోట కిడ్నాపర్ల కారును గుర్తించి పోలీసులు వెంబడించగా కిడ్నాపర్లు చెర్లపల్లి వద్ద కారు వదిలేసి వేరే కారులో వెళ్లిపోయారు. దీంతో బాధితుడు శ్యామ్​ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పూర్తి వివరాలు చెప్పాడు.

రూ.కోటి సుఫారీ​..

కిడ్నాప్​ సూత్రధారి ఎం.మాధవీలత(51) అమెరికాలో శ్యామ్ ను వివాహం చేసుకుని పదేళ్లు అక్కడే కాపురం చేసింది. ఆ తరువాత విడాకులు తీసుకున్నారు. మళ్లీ 2005లో హైదరాబాద్ కు వచ్చాక 2022 వరకు కలిసి ఉన్నారు. మూడేళ్లుగా మళ్లీ దూరంగా ఉంటున్నారు. దీంతో శ్యామ్.. ఫాతిమాను రెండో పెళ్లి చేసుకొని తన పేరును అలీగా మార్చుకున్నాడు. డీడీ కాలనీలో గల కృష్ణ తేజ రెసిడెన్సీలో నివాసముంటున్నాడు. రెండు నెలల క్రితం బంజారాహిల్స్ లో తన తండ్రి నుంచి వచ్చిన ఆస్తిని అమ్మేయగా రూ.22 కోట్లు వచ్చాయి. ఆ డబ్బులను కొట్టేయాలని మాధవీలత ప్లాన్​ చేసింది. 

అంబర్ పేట పటేల్ నగర్ కు చెందిన దుర్గావినయ్(32), రాంనగర్ కు చెందిన కట్ట దుర్గాప్రసాద్(32) సాయం కోరింది. కిడ్నాప్​ చేస్తే రూ.కోటి ఇస్తానని మాటిచ్చింది. వీరు ముగ్గురు కలిసి విద్యానగర్ కు చెందిన కాటమోని పురుషోత్తం(31), పురానాపూల్ కు చెందిన సందోలు నరేశ్​కుమార్(29), ఆగాపురాకు చెందిన కోశకోలు పవన్ కుమార్(25), మంగళ్ హాట్ కు చెందిన నారాయణ రిషికేష్ సింగ్(23), అంబర్ పేట పటేల్ నగర్ కు చెందిన పిల్లి వినయ్(29)తో గ్యాంగ్​ ఏర్పాటు చేశారు. 

కూకట్ పల్లి కి చెందిన జి.ప్రీతి(34), మలక్ పేటకు చెందిన ఎల్.సరిత(32) రెక్కీ నిర్వహించగా.. ఆ గ్యాంగ్​ గత నెల 29న కిడ్నాప్​కు పాల్పడింది. ఆస్తికి సంబంధించి శ్యామ్​ వద్ద సంతకాలు చేయించుకుని, డబ్బు తీసుకొని చంపేయాలని మాధవీలత ప్లాన్ చేసినట్లు డీసీపీ వెల్లడించారు. ఈ కేసులో ప్రమేయమున్న 10 మందిని అరెస్టు చేసి, మూడు కార్లు, రెండు బైక్​లు, 8 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.