అంటువ్యాధుల్లో క్షయ లేదా టీబీ ప్రమాదకరమైనది. ప్రధానంగా ఊపిరితిత్తులకు వచ్చే టీబీ అంటువ్యాధి ‘మైకోబ్యాక్టీరియమ్ ట్యుబర్‌క్యులోసిస్’ బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది. వ్యాధి సోకిన రోగులు దగ్గడం, తుమ్మడం, మాట్లాడడం, నవ్వడం లాంటివి చేసినపుడు సమీపంలో ఉన్న ఇతరులకు సోకుతుంది. చికిత్సలో భాగంగా నాలుగు రకాల యాంటీ బ్యాక్టీరియల్ మందుల కలయికతో టీబీని నయం చేస్తారు.
ఇలాంటి ట్యుబర్‌క్యులోసిస్ లేదా టీబీ వ్యాధి నివారణ, నిర్ధారణ, చికిత్స, కట్టడికి భవిష్యత్తు ప్రణాళికలు లాంటి అంశాలను అధ్యయనం చేసి 29 అక్టోబర్ 2024న ఐరాస- డబ్ల్యూహెచ్ఓ సంస్థ ‘గ్లోబల్ టిబి రిపోర్ట్-–2024’ను జెనీవాలో విడుదల చేసింది. టీబీ వ్యాధి భారం భారత్‌లో క్రమంగా తగ్గుతున్నట్లు స్పష్టం అవుతున్నప్పటికీ ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్‌లో టీబీ కేసులు అత్యధికంగా నమోదు కావడం కొంత కలవరపరిచే అంశం.
2023లో ప్రపంచవ్యాప్తంగా 10.8 మిలియన్ల కేసుల్లో లక్ష జనాభాలో 134 కేసులు టీబీ కేసులు నమోదుకాగా 2015లో లక్షకు 237 కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లో 6.1 శాతం హెచ్ఐవి సోకినవారికి సంభవించాయని తేలింది. 2023లో ఆగ్నేయ ఆసియాలో 45 శాతం, ఆఫ్రికాలో 24 శాతం, పశ్చిమ పసిఫిక్‌లో 17 శాతం, తూర్పు మెడిటరేనియన్‌లో 8.6 శాతం, అమెరికాలో 3.2 శాతం, యూరొప్‌లో 2.1 శాతం టీబీ కేసులు బయటపడినట్లు నివేదిక వివరిస్తున్నది.
ప్రపంచ క్షయవ్యాధి లేదా ట్యుబర్‌క్యులోసిస్ (టీబీ) కేసుల్లో అత్యధికంగా సంఖ్యలో 26 శాతం వరకు భారత్‌లోనే ఉన్నాయని, 55.9 శాతం ప్రపంచ టీబీ కేసులు కేవలం ఐదు దేశాల్లోనే నమోదు అవుతున్నాయని తాజాగా డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన ‘ప్రపంచ టీబీ నివేదిక 2024 (గ్లోబల్ టిబి రిపోర్ట్ - 2024)’ స్పష్టం చేస్తున్నది. భారత్‌లో 26 శాతం, ఇండోనేషియాలో 10 శాతం, చైనాలో 6.8 శాతం, ఫిలిప్పీన్స్‌లో 6.8 శాతం, పాకిస్తాన్‌లో 6.3 శాతం టీబీ కేసులు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. 2024లో 193 దేశాలకు చెందిన టీబీ కేసుల వివరాలు ఈ నివేదికలో చోటు దక్కించుకున్నాయి.
భారత్‌లో టీబీ వ్యాధి వ్యాప్తి
భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్’తో పాటు ‘నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్’, ‘మల్టీ-డ్రగ్- రెసిస్టెన్ట్ టీబీ (ఎండిఆర్-టీబీ)’ కార్యక్రమాల్లో భాగంగా దేశవ్యాప్తంగా టీబీ కేసులు తగ్గడం లేదా చికిత్స అందుబాటులోకి రావడం గమనించారు. భారతదేశంలో 2010లో టీబీ కారణ మరణాలు 5.8 లక్షలు ఉండగా, 2023లో 3.2 లక్షలకు తగ్గాయని, హెచ్ఐవి సోకిన లేదా సోకనివారితో కలిపి 26 శాతం ప్రపంచ టీబీ కేసులు నమోదు అయ్యాయని స్పష్టం అవుతున్నది.
టీబీ చికిత్సలు పెరుగుతున్నాయని, అయినా పోషకాహారలోపం, మధుమేహం, పొగాకు ఉత్పత్తుల వాడకం పెరగడంతో టీబీ కారణ మరణాలు సంభవిస్తున్నట్లు నివేదిక పేర్కొంటున్నది. కొవిడ్ అనంతరం టీబీ నివారణకు ప్రభుత్వ కేటాయింపులు తగ్గాయని, కానీ, గత 2022తో పోల్చితే 2023లో 38 శాతం అధిక నిధులు (3,400 కోట్లు) కేటాయించడం జరిగినట్లు తెలుస్తున్నది.
2015లో 72 శాతం టీబీ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందగా, 2023లో 89 శాతానికి (27 లక్షల కేసుల్లో 25.1 లక్షల కేసులకు చికిత్స లభిస్తున్నట్లు) అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తున్నది. టీబీ ప్రమాదకర, ప్రాణాంతక అంటువ్యాధి అని గుర్తించడం మన కనీస కర్తవ్యం. టీబీ వ్యాధి సోకిన వ్యక్తులకు దూరంగా ఉండడం, ఆ రోగులకు సరైన చికిత్సలను చేయించడం తప్పనిసరి అని గమనించాలి. తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే టీబీ నివారణ సాధ్యపడుతుందని, టీబీ పట్ల అవగాహన కలిగి క్షయ రోగాన్ని ప్రపంచ మానవాళి తరిమేయాలని కోరుకుందాం, టీబీ రహిత భారత్ కలలను సాకారం చేసుకుందాం.
డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
