దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం అర్ధరాత్రి భారత మహిళా క్రికెట్ జట్టు కొత్త చరిత్రకు నాంది పలికింది. దశాబ్దాల కలను నెరవేర్చుతూ యావత్ భారతావని ఉప్పొంగేలా ఆ చరిత్రను సువర్ణ అక్షరాలతో లిఖించింది. 15 మందితో కూడిన భారత మహిళా క్రికెట్ జట్టు 47 ఏండ్ల నిరీక్షణకు తెరదించుతూ దక్షిణాఫ్రికా బ్యాటర్ డిక్లేర్క్ ఇచ్చిన క్యాచ్ హర్మన్ ప్రీత్ కౌర్ అందుకోవడంతో 150 కోట్ల హృదయాలు గర్వంతో ఉప్పొంగాయి.
నాలుగు దశాబ్దాలుగా అందకుండా ఊరించిన ఐసీసీ ట్రోఫీని సొంతగడ్డపై మన అమ్మాయిలు సగర్వంగా ముద్దాడిన సందర్భంగా ఆ మధుర క్షణాల గురించి ఎంత చెప్పినా తక్కువే. యువ ప్లేయర్లు అద్భుతంగా రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు. జట్టు విజయంలో కోచ్ అమూల్ మంజుధర్ పాత్ర ఎనలేనిది అని చెప్పాలి. ఈ విజయంతో భవిష్యత్తులో దేశంలో మహిళా క్రికెట్ ఆదరణ పెరుగుతుంది అనడంలో సందేహం లేదు.ఒక విజయాన్ని సాధించడం అంటే అంత సులువైన పని కాదు ఆ విజయం వెనుక ఎంతోమంది కష్టాలు, త్యాగాలు ఇమిడి ఉంటాయి.
150 కోట్ల మంది కల సాకారం
ఇంతటి అద్భుత ప్రదర్శన చేసినటువంటి జట్టు సభ్యులలో చాలామంది దిగువ, మధ్యతరగతి స్థాయి నుంచి వచ్చినవారే. గ్రామీణ నేపథ్యం నుంచి కెప్టెన్ స్థాయికి ఎదిగిన హర్మన్ ప్రీత్, కార్పెంటర్ అయిన తండ్రి చెక్కిన బ్యాటుతో కెరీర్ మొదలుపెట్టిన ఆమన్ జోత్, మూడేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయి ఆర్థికకష్టాలు ఎదుర్కొన్న రేణుక, పోలీస్ కానిస్టేబుల్ కూతురు క్రాంతి గౌడ్, సామాన్య కుటుంబంలో పుట్టి అద్భుత ప్రదర్శన చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా అవార్డు అందుకున్న దీప్తి శర్మ ఇలా అనేకమంది జట్టు సభ్యులు 150 కోట్ల మంది భారతీయుల కలను సాకారం చేశారు.
మన దేశంలో మహిళా క్రికెట్ ప్రస్థానం ప్రత్యేక సౌకర్యాల నడుమ సాఫీగా ముందుకు సాగలేదు. ఆట పట్ల ప్రేమ, దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్న పట్టుదల కలిగిన క్రీడాకారుల త్యాగాలే ఇంధన వనరులై ప్రస్థానం మొదలైంది. 2025 కంటే చాలా ఏళ్ల కిందట నూట పదమూడు ఏళ్ల కింద అంటే 1913లో కేరళలోని కొట్టాయంలోని ఒక ప్రైవేటు స్కూల్లో పనిచేసిన టీచర్‌తో మొదలైంది భారత మహిళా క్రికెట్ ప్రయాణం. ఆస్ట్రేలియాకు చెందిన అన్నే కెల్లేవ్ కొట్టాయంలోని బేకర్ మెమోరియల్ స్కూల్లో చదువుతున్న ప్రతి బాలిక తప్పనిసరిగా క్రికెట్ ఆడాలని నిబంధన పెట్టిందట. కానీ, ఆ సమయంలో ఈ దేశంలోని అమ్మాయిలు ఒకనాడు ప్రపంచ విజేత అవుతారని ఆమె ఊహించి ఉండదు.
విజయాల పరంపర కొనసాగించాలి
2005 సంవత్సరం తర్వాత మహిళా క్రికెట్ జట్టును బీసీసీఐలో విలీనం చేశాక కొంచెం మార్పు మొదలయ్యింది. ముఖ్యంగా పురుషుల క్రికెట్ జట్టుతో సమానంగా మహిళా జట్టుకు వేతనాలు అందించడం, రవాణా, హోటల్ సదుపాయాలను, వసతులను కల్పించడంతోపాటు ఐపీఎల్ మాదిరిగానే మహిళా ప్రీమియర్ లీగ్ నిర్వహించడం జరుగుతోంది. దీంతో ప్రతిభావంతులైనటువంటి ప్లేయర్లు వెలుగులోకి రావడమే కాకుండా మహిళా క్రీడా కారిణులకు ఆర్థికంగా కుదుటపడేందుకు బాట పడింది.
గత కొన్ని సంవత్సరాల నుంచి విశ్వ వేదికలపై జరిగే అనేక క్రీడలలో మన మహిళా క్రీడాకారిణులు చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. కుటుంబ సభ్యుల తోడ్పాటు, ప్రభుత్వ సహకారం ఉంటే మహిళలు అద్భుతాలు సృష్టిస్తారు అనడానికి భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ ఛాంపియన్‌గా ఆవిర్భవించడం ఒక ఉదాహరణ మాత్రమే. భారతీయ మహిళలు తమ అద్భుతమైన ప్రతిభతో ఈ విజయాల పరంపర ఇదేవిధంగా కొనసాగించాలని ఆశిద్దాం.
డా. చింత ఎల్లస్వామి, అసిస్టెంట్ ప్రొఫెసర్ సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ
