ముంబైలో ఐదేండ్లల్లో కాలుష్యం డబుల్

ముంబైలో ఐదేండ్లల్లో కాలుష్యం డబుల్
  • దీపావళి తర్వాత మరింత పెరగొచ్చని ఆందోళన
  • క్లైమేట్-టెక్ స్టార్టప్  రెస్పైరర్ లివింగ్ సైన్సెస్ రిపోర్ట్

న్యూఢిల్లీ: దేశంలో వాయు కాలుష్యం నానాటికీ పెరిగిపోతోంది. గడిచిన ఐదేండ్లల్లో ముంబైలో గాలి నాణ్యత భారీగా క్షీణించింది. గడిచిన ఐదేళ్లలో గాలిలో కాలుష్య కారకాల పరిమాణం రెట్టింపు అయింది. ఢిల్లీలో కూడా పరిస్థితి చేయిదాటి పోతోందని క్లైమేట్- టెక్ స్టార్టప్ రెస్పైరర్  లివింగ్ సైన్సెస్  రిపోర్ట్ వెల్లడించింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్‌‌కతాలోనూ పీఎం(పర్టిక్యులేట్ మ్యాటర్) 2.5 స్థాయి కాలుష్య కాలుష్యకారకాలు గణనీయంగా పెరిగాయి. ముంబైలో 2019 నుంచి 2020 మధ్య 54.2% పెరిగిన పీఎం2.5.. 2021లో (3%), 2022లో (0.9%) స్వల్పంగా తగ్గింది. పొల్యూషన్ కంట్రోల్ చేసేందుకు ముంబై అధికారులు..350 సిటీ బస్సుల్లో వెహికల్ మౌంటెడ్ ఎయిర్ ఫిల్టర్‌‌లను అమర్చారు. ట్రాఫిక్ ప్రదేశాల్లో వర్చువల్ చిమ్నీలను, ప్రత్యేక వీధిలైట్లను ఏర్పాటు చేశారు. నగరంలో తిప్పేందుకు స్ప్రింక్లర్లు అమర్చిన 30 వెహికిళ్లను కూడా ఆర్డర్ చేశారు. చిమ్నీల ఎత్తును పెంచాలని పరిశ్రమలను కోరారు.

దీపావళితో  పీక్ పొల్యూషన్

ఢిల్లీలో 2019, 2020 మధ్య పీఎం 2.5 స్థాయి 32% పెరగగా..2021లో తగ్గుదల(43.7%) నమోదు చేసింది. 2022, 2023లో స్థిరమైన పెరుగుదల కనిపించింది. వచ్చే దీపావళితో పీక్ పొల్యూషన్ సీజన్ ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు.

గాలి నాణ్యతపై సుప్రీం ఆందోళన

దిగజారుతున్న గాలి నాణ్యతపై సుప్రీంకోర్టు ఇటీవల ఆందోళన వ్యక్తంచేసింది. కాలుష్య నియంత్రణకు  తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌‌ ప్రభుత్వాలను ఆదేశించింది. పంజాబ్, హర్యానాలలో పంట కోతల తర్వాత మిగిలిపోయిన గడ్డిని తగులబెట్టడం వల్లే ఉత్తరాది రాష్ట్రాల్లో కాలుష్యం పెరుగుతోంది. వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం వంటి చర్యలు పంజాబ్‌‌లో 740% పెరిగాయి.