మట్టిలో మాణిక్యాలు ఈ అక్కాచెల్లెళ్లు.. ఫస్ట్ అటెంప్ట్లోనే UGC NET క్లియర్ చేసిన కూలీ బిడ్డలు !

మట్టిలో మాణిక్యాలు ఈ అక్కాచెల్లెళ్లు.. ఫస్ట్ అటెంప్ట్లోనే UGC NET క్లియర్ చేసిన కూలీ బిడ్డలు !

కటిక పేదరికం.. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు. ఒక్క రోజు కూలీ పనులకు వెళ్లకుంటే ఇల్లు గడవని పరిస్థితి. అయినా తన కూతుళ్లను చదివించారు ఆ తల్లిదండ్రులు. తమ కూతుర్ల జీవితం తమలా కాకూడదని.. చదువు చెప్పిస్తే వాళ్ల జీవితం మారిపోతుందని భావించారు. వాళ్లు తలచినట్లే వాళ్ల జీవితం మారిపోయింది. ఫస్ట్ అటెంప్ట్ లోనే యూజీసీ నెట్ క్లియర్ చేసి తమ తలరాతలు మార్చుకున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు టాక్ ఆఫ్ ద కంట్రీగా మారారు. 

పంజాబ్ రాష్ట్రం మన్సా జిల్లా బుద్లాదా గ్రామానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. 2025 మేలో నిర్వహించిన యూజీసీ నెట్ క్లియర్ చేయడం అకాడమిక్ మైల్ స్టోన్ గా నిలిచింది. వ్యవసాయ కూలీ కూతుళ్లైన రింపీ కౌర్, బీంత్ కౌర్, హర్ దీప్ కౌర్ లు నెట్ క్వాలిఫై అవ్వడంతో.. పీహెచ్డీ పూర్తి చేసి ప్రొఫెసర్ లక్ష్యాన్ని ఎక్కుపెట్టారు. 

తండ్రి బిక్కర్ సింగ్ గురుద్వారాలో గ్రంథీగా పనిచేస్తుండగా.. తల్లి మంజీత్ కౌర్ వ్యవసాయ కూలీగా పనులు చేస్తుంటుంది. ఆర్థికంగా, సామాజికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉన్నత చదువులు చదవి ఎదగాలనే తమ లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయలేదు. చదువే మా జీవితాన్ని మారుస్తుందనే నమ్మకంతో ముందుకు సాగామని బీంత్ కౌర్ చెప్పింది. మా పేరెంట్స్ చదువుకోకపోయినా.. మమ్మల్ని చదువు విషయంలో బాగా ప్రోత్సహించారు. ఎన్ని కష్టాలున్నా మాకు ఇబ్బంది రాకుండా చదువుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారని తెలిపింది. 

తండ్రి బిక్కర్ సింగ్ మాట్లాడుతూ.. నేను చదువుకోకపోయినా.. నా బిడ్డలు చదివి సక్సెస్ కావడం చాలా సంతోషంగా ఉంది.. ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నానని అన్నారు. అనారోగ్యం కారణంగా మా పెద్ద కొడుకు చదువు మానేశాడు.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి.. అయినా ఎక్కడా నిరుత్సాహ పడకుండా చదువుకుని మా నమ్మకాన్ని నిలబెట్టారని అన్నారు. 

నెట్ క్వాలిఫై అయిన ఈ సిస్టర్స్.. తమ నెక్స్ట్ టార్గెట్ JRF అని.. పీహెచ్డీ పూర్తి చేసి ప్రొఫెసర్ కావాలన్నదే తమ లక్ష్యం అని చెప్పారు.