
- చట్ట ప్రకారమే జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ నియామకం
- ప్రాథమిక ఆధారాలతోనే కేసీఆర్‌కు నోటీసులిచ్చింది
- బహిరంగ విచారణ కాబట్టే ఎంక్వైరీ స్థాయిని మీడియాకు చైర్మన్ చెప్పారు
- అట్ల చెప్పడాన్ని పక్షపాతం అంటే ఎట్ల?..
- ఊహాజనిత ఆరోపణలు చేసుడేంది?
- కేసీఆర్‌పై హైకోర్టు ఆగ్రహం
- కమిషన్ నోటీసుల అమలును ఆపలేమని తీర్పు
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు.. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లోని లోటుపాట్లపై విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్.నర్సింహా రెడ్డి జ్యుడీషియల్ కమిషన్‌ను రద్దు చేయాలంటూ ఆయన వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది.
విచారణకు స్వీకరించే ప్రాథమిక దశలోనే హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటితో కూడిన డివిజన్ బెంచ్ కొట్టివేస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. కమిషన్‌కు విచారణ అర్హత లేదన్న కేసీఆర్ వాదన చట్ట వ్యతిరేకమని తేల్చిచెప్పింది. కమిషన్‌పై ఊహాజనితంగా కేసీఆర్ అభియోగాలు మోపారని, ఎలాంటి ఆధారాలు చూపలేదని పేర్కొంది.
‘‘విద్యుత్తు కొనుగోళ్లు, ఉత్పత్తి సంస్థల ఏర్పాటులో కేసీఆర్ పాత్ర ఉన్నట్టు జస్టిస్నర్సింహారెడ్డి కమిషన్ ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. అందుకు ఆధారాలున్నాయని భావించే రూల్స్ ప్రకారం కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. ఇందులో కమిషన్‌ను తప్పుబట్టడానికి ఏముంది? నోటీసుల అమలును నిలిపివేయడానికి ఆస్కారమే లేదు” అని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.
ఈఆర్సీ కంటే కమిషన్ పరిధి పెద్దది
రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ అథారిటీ (ఎస్‌ఈఆర్సీ) పరిధి కంటే కమిషన్ పరిధి పెద్దదని, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై తెలంగాణ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఈఆర్సీ లు తేల్చే అంశాలపై విచారించే పరిధి కమిషన్‌కు ఉం దని తీర్పులో హైకోర్టు స్పష్టం చేసింది. కమిషన్ విధి విధానాలు చూస్తే ఆ విషయం స్పష్టమవుతుందని పేర్కొంది. ‘‘ఈఆర్సీలు తేల్చే అంశాలను సమీక్షించే పరిధి జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్‌కు ఉంది. ఈ కమిషన్‌కు విచారణ పరిధి లేదన్న పిటిషనర్ (కేసీఆర్) వాదన చట్టబద్ధం కాదు. జస్టిస్ నర్సింహారెడ్డి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి ఆయన మీడియాతో మాట్లాడటాన్ని ఒక్కటే పిటిషనర్ చూపుతున్నారు.
మీడియాలో ప్రకటన తప్ప మరెలాంటి ఆధారాలు పిటిషనర్ చూపలేదు. అంతా ఊహాజనితంగానే అభియోగాలు మోపారు. ఆధారాలు చూపడంలో ఫెయి లయ్యారు. ఎంక్వయిరీ కమిషన్ యాక్ట్ సెక్షన్ 8 బీ ప్రకారం ఇచ్చిన నోటీసు చెల్లదన్న కేసీఆర్ వాదన చట్ట వ్యతిరేకం. ఆ నోటీసుల అమలును నిలిపివేయడం కుదరదు. నిబంధనల ప్రకారమే కమిషన్ నోటీసులు ఇచ్చింది. అందుకే కేసీఆర్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నం” అని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.
కమిషన్‌ను ఏర్పాటు చేసే పవర్ ప్రభుత్వానికి ఉంది
విద్యుత్ కొనుగోళ్లు.. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాలు వంటి వాటి నిర్ణయాలు చట్టబద్ధంగా ఉన్నాయో లేవో తేల్చేందుకే కమిషన్‌ను ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని హైకోర్టు పేర్కొంది. ‘‘విద్యుత్ కమిషన్ నియామకం చట్టబద్ధంగానే ఉంది. కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ యాక్ట్–1952 ప్రకారం ఏదైనా అంశంపై వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్లను వేస్తుంటాయి. సంబంధిత వ్యక్తులకు కమిషన్ నోటీసులు జారీ చేసి వివరాలు సేకరిస్తుంది. వీటికి సంబంధించిన ఆఫీస్ ఫైళ్లను పరిశీలించే అధికారం కూడా ఉంటుంది.
విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం కమిషన్ విధి. ఫలానా వాళ్లు తప్పు చేశారంటూ ఎవరినీ బాధ్యులుగా తేల్చే అధికారం కమిషన్‌కు ఉండ దు. ఎప్పుడైనా సున్నితమైన అంశాలపై సాధారణ దర్యాప్తు సంస్థలకు విచారణ అప్పగిస్తే పలు సందేహాలకు తావిచ్చే చాన్స్ ఉంటుంది. అధిక ప్రజాప్రయోజనాలు ఉన్న వాటిపై కమిషన్‌ను ఏర్పాటు చేయడం ద్వారా వాస్తవ పరిస్థితులపై ప్రభుత్వాలు రిపోర్టులు తెప్పించుకుంటాయి. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ నియామకం చట్టబద్ధమే” అని హైకోర్టు తన తీర్పులో వెల్లడించింది.
ఈఆర్సీలోనే తేల్చాలంటే ఎట్ల?
కమిషన్‌ను కాదని, ఈఆర్సీలోనే తేల్చాలన్న కేసీఆర్ వాదన ఏమాత్రం కరెక్ట్ కాదని హైకోర్టు పేర్కొంది. ‘‘ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ చేశాక యూనిట్ విద్యుత్ ధర రూ.3.90గా నిర్ణయిస్తూ 2017 మార్చి 31న ఉత్తర్వులిచ్చింది. చతీస్‌గఢ్ నిర్ణయించిన రేట్లకే విద్యుత్ కొనుగోలు చేయాలని తెలంగాణ డిస్కమ్‌లకు ఆదేశాలు వెలువడ్డాయి. చత్తీస్‌గఢ్ ఈఆర్సీ 2018 జులై 7న టారిఫ్ నిమిత్తం ప్రాజెక్టు ఖర్చును నిర్ధారిస్తూ ఆదేశాలను వెలువరించింది. దీనిపై తెలంగాణ డిస్కంలు అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన కేసులు నేటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి.
ప్రాజెక్టు ఖర్చు, టారిఫ్ నిర్ణయాలపై రెండు రాష్ట్రాల ఈఆర్సీలు విచారించాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్ విధివిధానాలను పరిశీలిస్తే.. పీపీఏ, విద్యుత్ ప్లాంట్ల ఏర్పాట్లలో లోపాలు, లొసుగులు, వీటి ఫలితంగా ఆర్థికంగా పడే ప్రభావం.. వంటి వాస్తవ నివేదిక ఇవ్వాలని ఉంది. రెండు రాష్ట్రాల ఈఆర్సీలు తేల్చే అంశాల కంటే కమిషన్ తేల్చే పరిధి చాలా విస్తృతం. వ్యవహారాన్ని ఈఆర్సీలోనే తేల్చాలన్న పిటిషనర్ వాదనలో ఏమాత్రం చట్టబద్ధత లేదు. విచారణ పరిధి జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి కమిషన్‌కు లేదనడం కూడా చెల్లదు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదన ఆమోదయోగ్యంగా ఉంది” అని స్పష్టం చేసింది.
పక్షపాతం అని ఎట్లంటరు?
జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ తీరు పక్షపాతమని కేసీ ఆర్ చెప్పడం సరికాదని హైకోర్టు తప్పుబట్టింది. ‘‘ముం దే ఒక నిర్ణయానికి కమిషన్ వచ్చినట్టు, పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్లు పిటిషనర్ (కేసీఆర్) చేసిన వాదనలకు ఆధారాల్లేవ్. ఊహాజనితంగా అభియోగాలు మోపి, పక్షపాతం అంటే సరికాదు” అని హైకోర్టు తెలిపింది. కమిషన్ నోటీసులు జారీ చేసినప్పుడు ఎన్నికల బిజీలో ఉన్నామని చెప్పి కేసీఆర్ వాయిదా కోరారని, ఆ తర్వాత విలేకరుల సమావేశాన్ని జస్టిస్ నర్సింహారెడ్డి నిర్వహించారని చెప్పి కమిషన్ తీరును పక్షపాతమంటూ అభియోగం మోపడం ఏమిటని ప్రశ్నించింది.
పిటిషనర్ తీరు కరెక్ట్ కాదని పేర్కొంది. ‘‘విచారణ స్థాయిని వెల్లడించే క్రమంలోనే జూన్ 11న జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి మీడియా మీడియాతో మాట్లాడారు. బహిరంగ విచారణ కాబట్టి కమిషన్ ఏమేరకు దర్యాప్తు పూర్తి చేసిందో చెప్పింది. అంతేగానీ, ఎలాంటి నివేదిక ఇస్తున్నామో చెప్పడానికి ఆ మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదు. దీన్నే పక్షపాతం అంటే ఎట్ల? జస్టిస్ నర్సింహారెడ్డి గతంలో పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా రాజ్యాంగ విధులు నిర్వహించారు. ఇలాంటి కమిషన్‌పై ఊహాజనిత అభియోగాలు మోపడం ఏమిటి?” అని పిటిషనర్ (కేసీఆర్)ను హైకోర్టు ప్రశ్నించింది. సెక్షన్ 8బీ కింద కేసీఆర్‌కు కమిషన్ నోటీసులు ఇవ్వడం చట్టబద్ధమేనని, ఇది చట్ట వ్యతిరేకమన్న పిటిషనర్ వాదన చెల్లదని స్పష్టం చేసింది.
22 పేజీల తీర్పు
కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ యాక్ట్ -1952 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వ్యవహారాలపై జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి చైర్మన్‌గా ఏకసభ్య కమిషన్‌ను మార్చి 14న నియమించింది. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, చత్తీస్‌గఢ్-తెలంగాణ మధ్య విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని పేర్కొంటూ విద్యుత్ శాఖ జారీ చేసిన జీవో 9 ద్వారా జ్యుడీషియల్ కమిషన్ విచారణ ప్రారంభించింది. కమిషన్‌కు విచారణ పరిధి లేదని, దాన్ని రద్దు చేయాలని హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు.
జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి కమిషన్, విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు వ్యక్తిగత హోదాలో జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డిని ఆయన ప్రతివాదులుగా పేర్కొన్నారు. జస్టిస్ నర్సింహారెడ్డి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, విచారణ పూర్తి కాకుండానే తనకు వ్యతిరేకంగా ఉండబోతున్నదన్నట్టుగా మీడియాకు చెప్పారని పిటిషన్లో కేసీఆర్ తెలిపారు.
జస్టిస్ నర్సింహారెడ్డిని వ్యక్తిగత ప్రతివాదిగా చేర్చడంతో పిటిషన్‌కు నంబర్ కేటాయించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ నిరాకరించారు. దీనిపై గురువారం విచారించిన హైకోర్టు.. రిజిస్ట్రీ అభ్యంతరాలను కొట్టివేసింది. నంబర్ కేటాయింపు తర్వాత పిటిషన్ విచారణార్హతపై శుక్రవారం వాదనలు పూర్తి చేసింది. కేసీఆర్ పిటిషన్‌ను కొట్టివేస్తూ సోమవారం 22 పేజీల తీర్పు వెలువరించింది.