
దేశంలో ప్రజలు బంగారం కంటే వెండి కొనుగోళ్లకు ఎక్కువగా మెుగ్గుచూపుతున్నారు. ధరలు విపరీతంగా పెరుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో కొనలేమనే భయంతో అవసరం లేకుండా సిల్వర్ కాయిన్స్, సిల్వర్ బార్స్ కొనిపెట్టుకుంటున్నారు. దీంతో రోజురోజుకూ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది.
ప్రస్తుతం కేజీ వెండి రేటు రెండు లక్షలు క్రాస్ చేయటంతో ముంబైలోని ఫేమస్ జవేరీ బజార్ వ్యాపారులు కస్టమర్ల నుంచి భారీగా ఎంక్వైరీలు పెరిగాయని చెబుతున్నారు. గతవారం వెండి కేజీ లక్షా 62వేల వద్ద ఉండగా ఒక్కవారంలోనే రూ.2 లక్షలకు చేరుకోవటంతో అటు వ్యాపారులు, ఇటు కొనుగోలుదారుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో జవేరీ బజారులోని వ్యాపారులు కొత్తగా వెండి ఆర్డర్లు తీసుకోవటం నిలిపివేయటం సంచలనంగా మారింది. ప్రధానంగా దీపావళి, ధనత్రయోదశి సమయంలో రేట్లు ఇంకా పెరుగుతాయని భావిస్తున్నారు.
ఈ క్రమంలో వ్యాపారులు కూడా అమ్మకాలపై ఆచితూచి సెలెక్టివ్ గా ముందుకెళుతున్నారు. ఉన్న రేటు కంటే ఎంత ఎక్కువ చెల్లించటానికి కొనుగోలుదారులు సిద్ధంగా ఉన్నారనే విషయం తెలుసుకున్నాకే అమ్మాలా వద్దా అమ్మితే ఎన్ని గ్రాములు ఇస్తామనే విషయాలు బయటపెడుతున్నారు జవేరీ బజార్ జ్యువెలర్లు. మరో వ్యాపారి తమకు వచ్చే సరకు ఆధారంగానే అమ్మకాలు చేస్తున్నామని పూర్తిగా స్టాక్ క్లియర్ అయినా సేల్ చేస్తే ఇబ్బందుల్లో పడతామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈసారి పండుగ కోసం 10 రోజులకు సరిపడా స్టాక్ రెడీ చేసుకుంటే అది జస్ట్ మూడు రోజుల్లోనే అమ్ముడైపోయినట్లు సదరు వ్యాపారి చెప్పారు.
ALSO READ : సిల్వర్ రేటు తగ్గాలంటే రాగి ఉత్పత్తి పెరగాలా..?
ప్రధానంగా చైనా, ఆస్ట్రేలియా, టర్కీ లాంటి దేశాల నుంచి విపరీతంగా పెరిగిన డిమాండ్ కారణంగా భారతదేశంలో కూడా రేట్లు పెరుగుతున్నాయని ట్రేడర్లు చెబుతున్నారు. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా వెండి డెలివరీ కూడా ఆలస్యం అవుతోందని అంటున్నారు. ప్రస్తుతానికి బంగారం సరఫరాలో ఇబ్బందులు లేవని వెండి విషయంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందన్నారు జవేరీ బజార్ వ్యాపారి. అందుకే దీపావళికి కొత్తగా ఆర్డర్లు తీసుకోవటం నిలిపివేసినట్లు చెప్పారు.
వెండి కొన్న వ్యక్తులు కనీసం ఐదేళ్లు దానిని హోల్డ్ చేస్తే మంచి రాబడిని చూడొచ్చని తెలుస్తోంది. నవంబర్ నాటికి కొద్దిగా వెండి రేట్లలో తాత్కాలిక తగ్గింపు రావచ్చని కూడా తెలుస్తోంది. దీంతో వెండికి విపరీతంగా పెరిగిన డిమాండ్ కారణంగా ముంబై జవేరీ బజారు కూడా జామ్ అయ్యింది.