ప్రైవేటు యూనివర్సిటీలు  పెరుగుతున్నయ్

ప్రైవేటు యూనివర్సిటీలు  పెరుగుతున్నయ్

ఐదేండ్లలో ఐదే పెరిగిన సెంట్రల్ వర్సిటీలు 
స్టేట్ వర్సిటీలూ నామమాత్రమే
 
హైదరాబాద్, వెలుగు: దేశంలో ప్రైవేటు యూనివర్సిటీల జోరు కొనసాగుతోంది. ఏటా వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఐదేండ్ల కింద 197 ఉంటే, ప్రస్తుతం 327 స్టేట్ ప్రైవేటు యూనివర్సిటీలు ఉన్నాయి. వీటి ప్రభావం రాష్ట్ర, సెంట్రల్ యూనివర్సిటీలపై పడుతోంది. ప్రైవేటు వర్సిటీలకు అనుమతులిచ్చినట్టు, సర్కారు వర్సిటీలను మాత్రం రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాటు చేయట్లేదు. ఐదేండ్లలో ఐదే సెంట్రల్ యూనివర్సిటీలు పెరగ్గా, రాష్ట్ర సర్కారు వర్సిటీలు 57 పెరిగాయి.
23 రాష్ట్రాల్లో ప్రైవేటు వర్సిటీలు
దేశవ్యాప్తంగా 2019–20 అకాడమిక్ ఇయర్​లో మొత్తం 1,043 యూనివర్సిటీలున్నాయి. వీటిలో సెంట్రల్ వర్సిటీలు 48 ఉండగా, స్టేట్ పబ్లిక్ వర్సిటీలు 386, స్టేట్ ప్రైవేటు వర్సిటీలు 327 ఉన్నాయి. మిగిలినవన్నీ గవర్నమెంట్, ప్రైవేటు డ్రీమ్డ్, ఓపెన్ వర్సిటీలు. వీటకి అనుబంధంగా 42,343 కాలేజీలు కొనసాగుతున్నాయి. వీటిలో 3.85 కోట్ల మంది స్టూడెంట్లున్నారు. ఇప్పటివరకు మన దేశంలో 23 రాష్ట్రాల్లో ప్రైవేటు వర్సిటీలుండగా, 2020–21లో తెలంగాణలోనూ ఐదు వర్సిటీలు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా 2015–16 లో197 ప్రైవేటు వర్సిటీలుండగా, 2016–17లో 233, 2017–18లో 262, 2018–19లో 304, 2019–20లో ఆ సంఖ్య 327కు చేరింది. అత్యధికంగా రాజస్థాన్​లో 50, గుజరాత్​లో 37, మధ్యప్రదేశ్​లో 33, ఉత్తరప్రదేశ్​లో 29, ఆంధ్రప్రదేశ్​లో 3 ఉన్నాయి.  
ఐదేండ్లలో ఐదే పెరిగినయ్
దేశంలో సెంట్రల్ యూనివర్సిటీలకు మంచి డిమాండ్ ఉంది. వాటిని పెంచాలనే డిమాండ్ చాలా ఏండ్లుగా ఉన్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం మాత్రం పెంచట్లేదు. 2015–16లో 43 సెంట్రల్ వర్సిటీలుంటే, 2019–20 నాటికి ఆ సంఖ్య 48కి పెరిగింది. అంటే ఐదేండ్లలో కేవలం 5 మాత్రమే పెరిగాయి. అత్యధికంగా ఢిల్లీలో ఐదుండగా, బీహార్​లో నాలుగున్నాయి. మణిపూర్, తెలంగాణలో మూడు చొప్పున ఉన్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్​ తదితర రాష్ట్రాల్లో సర్కారు వర్సిటీల కంటే ప్రైవేటు వర్సిటీలే ఎక్కువగా ఉన్నాయి.
స్టేట్ వర్సిటీలూ అంతంతే
రాష్ట్రాల డిమాండ్​కు అనుగుణంగా ఏర్పాటు చేసుకునే స్టేట్ యూనివర్సిటీలూ గత ఐదేండ్లలో నామమాత్రంగానే పెరిగాయి. 2015–16లో 329 ఉంటే, 2019–20 నాటికి 386 కు పెరిగాయి. ఐదేండ్లలో కేవలం 57  పెరగడం గమనార్హం. సర్కారు స్టేట్ వర్సిటీలు అత్యధికంగా కర్నాటకలో 30 ఉండగా, గుజరాత్, ఉత్తరప్రదేశ్​లో 28 చొప్పున, రాజస్థాన్​లో 25 ఉన్నాయి. పలు ప్రాంతాల్లో అవసరాలకు అనుగుణంగా వర్సిటీలను ఏర్పాటు చేయాలనే డిమాండ్లు వస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. దీంతో స్టూడెంట్లు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వర్సిటీల బాట పట్టడమో, లేక మధ్యలో మానెయ్యడమో చేస్తున్నారు.