
నకిరేకల్, వెలుగు : కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం నకిరేకల్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతు భరోసా ఇచ్చామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం, రైతు రుణమాఫీ, 500 గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. ప్రతిపక్ష నాయకుడిని అసెంబ్లీలో చర్చకు రమ్మని కోరితే భయపడి ఫాం హౌస్ లో పడుకున్నారని ఎద్దేవా చేశారు.
కాళేశ్వరం పేరు చెప్పుకొని పబ్లిసిటీ చేసుకున్నారు తప్ప.. రైతులకు చుక్క నీరు ఇవ్వలేదన్నారు. పోటీపడి బావ, బామర్ధి మైకులు పట్టుకొని అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. నల్గొండ జిల్లాలో గడిచిన పదేండ్లలో ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇచ్చారో దమ్ముంటే చెప్పాలని కేటీఆర్, హరీశ్ రావుకు సవాల్విసిరారు. బీఆర్ఎస్ నాయకుల మాయ మాటలు ప్రజలు నమ్మరని తెలిపారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.